భారత్ (India) హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా (Canada) చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వియన్నా ఒప్పంద (Vienna Convention) సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూదిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొనడం గమనార్హం. అటు ఈ వ్యవహారంపై యూకే (UK) కూడా స్పందిస్తూ.. కెనడాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. (India-Canada Diplomatic Row)
‘‘భారత్లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని దిల్లీ డిమాండ్ చేయడం.. దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరం. కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ వారిపై ఒత్తిడి చేయొద్దని మేం ఇప్పటికే దిల్లీని కోరాం. అంతేగాక, కెనడా దర్యాప్తునకు (నిజ్జర్ హత్య అంశంలో) భారత్ సహకరించాలని అభ్యర్థించాం. 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద దౌత్య సంబంధాలపై తన బాధ్యతలను భారత్ సమర్థించాలి. కెనడా దౌత్య మిషన్లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ వారికి కల్పించాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.’
భారత్ నిర్ణయాన్ని అంగీకరించం: యూకే
అటు బ్రిటన్ విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ‘‘భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా దిల్లీ తీసుకున్న నిర్ణయాన్ని మేం అంగీకరించలేం. దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణకు ఏకపక్షంగా ఎత్తివేయడం.. వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదు’’ అని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తొలుత అమెరికా తటస్థంగా వ్యవహరించగా.. ఆ తర్వాత కెనడాకు మద్దతుగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని పేర్కొంది. తాజాగా దౌత్యవేత్తల తగ్గింపు వివాదంపైనా అమెరికా.. కెనడాకు మద్దతుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కి రప్పించుకున్నట్టు కెనడా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కెనడా తమ అక్కసు వెళ్లగక్కింది. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. తాము నిబంధనలకు అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.