NRI-NRT

కెనడా జోక్యం మాకు ఆందోళన కలిగిస్తోంది

కెనడా జోక్యం మాకు ఆందోళన కలిగిస్తోంది

కెనడా, భారత్ మధ్య సాగుతున్న దౌత్య వివాదంలోకి అమెరికా, బ్రిటన్ ఎంటరైన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆదివారం ఘాటుగా స్పందించారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా పదేపదే జోక్యం చేసుకుంటున్నందు వల్లే ఢిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందన్నారు. దౌత్యవేత్తల సంఖ్య విషయంలో దేశాలు సమానత్వ సూత్రాన్ని పాటించవచ్చని వియన్నా కన్వెన్షన్‌లో ప్రస్తావించిన నిబంధనలనే తాము ఫాలో అవుతున్నామని జైశంకర్ స్పష్టం చేశారు.ప్రస్తుతం ఇండియా, కెనడాల్లో సరిసమానంగా 21 మంది దౌత్యవేత్తలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశ వ్యవహారాల్లో కెనడా జోక్యం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. కెనడా రాజకీయ వ్యవస్థలో మమేకం అయిపోయిన కొన్ని శక్తుల వల్ల భారత్‌కు ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇతర దేశాల దౌత్యవేత్తలు, ప్రజలకు భద్రత కల్పించడం అనేది వియన్నా కన్వెన్షన్‌లోని కీలకమైన నిబంధన. దీని అమలులో కెనడా విఫలమైంది. భారత ప్రజలకు, దౌత్యవేత్తలకు కెనడాలో భద్రత లేకుండాపోయింది’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆరోపించారు. ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలకు తూట్లు పొడుస్తున్నది కెనడా మాత్రమే అని ఆయన తేల్చి చెప్పారు. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మెరుగైన తర్వాత వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z