Politics

ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. ములాఖ‌త్‌లో భాగంగా తనను క‌లిసిన కుటుంబ‌స‌భ్యుల‌కు తెలుగు ప్రజలనుద్దేశించి రాసిన లేఖను అంద‌జేశారు.

‘‘ నేను జైలులో లేను.. మీ అందరి గుండెల్లో ఉన్నా. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నా. విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నా. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల నా ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ, అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటా.

కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు. కానీ, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయను.. చేయనివ్వను. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వరలో బయటకొస్తా. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా.

ఈ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తా. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్‌ కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా. ఎప్పుడూ బయటకు రాని నా భార్య భువనేశ్వరిని.. నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫు పోరాడాలని నేను కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వస్తోంది.

జనమే నా బలం, జనమే నా ధైర్యం. దేశవిదేశాల్లో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమోకానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తా. అంత వరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ నారా చంద్రబాబు నాయుడు’’ అని లేఖలో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z