సినీ నటి గౌతమి (Gautami Tadimalla) భాజపా (BJP)కు రాజీనామా చేశారు. పార్టీతో తన పాతికేళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని, పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి కొంతమంది సీనియర్లు అండగా నిలిచినట్లు ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ ప్రకటన పోస్టు చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారని కూడా గౌతమి తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. స్థిరాస్తుల విషయంలో అళగప్పన్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ గత సెప్టెంబరులో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
‘దాదాపు 20 ఏళ్ల క్రితం నా పరిస్థితులను ఆసరాగా చేసుకొని అళగప్పన్ అనే వ్యక్తి నమ్మిన బంటులా చేరాడు. అయితే.. డబ్బు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌ల విషయంలో అతడు నన్ను మోసం చేసినట్లు గుర్తించా. అతడిపై ఫిర్యాదు చేయగా.. కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి 40 రోజులు గడిచినా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు సాయం చేస్తున్నారు’ అని గౌతమి ఆరోపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజపాళయం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి బాధ్యతలను తనకు అప్పగించారని, అక్కడి నుంచి పోటీకి అవకాశం ఇస్తామని కూడా పార్టీ నాయకులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని.. కానీ, చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. అయినప్పటికీ.. పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నట్లు చెప్పారు.
దేశ నిర్మాణంలో తనవంతు సహకారంగా 25 ఏళ్ల క్రితం భాజపాలో చేరినట్లు గౌతమి పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో సవాళ్లు ఎదురైనప్పటికీ పార్టీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇలా 25 ఏళ్లపాటు సేవ చేసినా.. పార్టీ నుంచి తనకు మద్దతు లభించడంలేదని గౌతమి వాపోయారు. నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తనకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పోలీసు, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఒక ఒంటరి మహిళగా, సింగిల్ పేరేంట్‌గా.. తన కోసం, తన కుమార్తె కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలో చదువుకుంటూ సినీ నటిగా ప్రవేశించి తనదైన నటనతో అలరించిన నటి గౌతమి. ‘దయామయుడు’ సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్ ‘కుమారి శ్రీమతి’లో నిత్యామేనన్‌కు తల్లిగా నటించారు.
👉 – Please join our whatsapp channel here –