NRI-NRT

దక్షిణాఫ్రికాలో బతుకమ్మ వేడుకలు

దక్షిణాఫ్రికాలో బతుకమ్మ వేడుకలు

తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) ఆధ్వర్యంలో జోహాన్నెబర్గ్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణాఫ్రికాలోని ఆడపడుచులు అందమైన బతుకమ్మలను అలంకరించి భక్తిశ్రద్ధలతో గౌరీ దేవిని సేవించుకున్నారు. వారి ఆట పాటలతో ప్రాంగణం అంతా తన్మయత్వంతో పులకరించింది. తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో బాలబాలికలు, మహిళలు ఆహూతులను అలరించారు. తెలంగాణ జానపద కళాకారుల పాటలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కేవలం ప్రవాస తెలంగాణ వాసులతోపాటు ప్రవాస కోస్తాంధ్రవాసులు, స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన సంప్రదాయాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ) తరపున హాజరైన డాక్టర్ వినీత్ కుమార్ (కాన్సూల్ – హెచ్ఓసీ అండ్ కామర్స్) మాట్లాడుతూ, ఇది దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అతి పెద్ద భారతీయ ఉత్సవం అని అన్నారు. ఇక్కడి పండుగ వాతావరణం తనకు భారతదేశంలో ఉన్న అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) అధ్యక్షులు శ్రీనివాస్ తాళ్లూరి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా తొమ్మిదో ఏటా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని, దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ భారీ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.టాసా అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని టాసా వైస్ చైర్మన్ యెలిగేటి వేణుమాధవ్ అన్నారు. కోశాధికారి బొబ్బాల శ్రీనివాస్ ఆర్థిక సహకారం అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాఫ్రికా, తెలంగాణ సంస్కృతుల్లో సామీప్యం ఉందని ఈ రెండు ప్రాంతాలకు టాసా ఒక సాంస్కృతిక వారధిగా పనిచేస్తుందని సెక్రెటరీ జనరల్ రాపోలు సీతారామరాజు అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z