భద్రాచలం క్షేత్రంలో మంగళవారం దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 15న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి ఉత్సవాలు ముగియనున్నాయి. విజయదశమి సందర్భంగా 24న ఆలయంలో సంక్షేపరామాయణ హోమం, పూర్ణాహుతి, మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. దసరా మండపంలో విజయోత్సవం, శమీపూజ, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవాన్ని జరుపనున్నారు. ఈ మేరకు అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రులు సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి సీతారామస్వాముల వారిని దర్శించుకుంటున్నారు.భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామాలయంలో ముత్యాల వస్త్రాలతో ముత్తంగి అలంకరణలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మరో వైపు ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. నిజరూప లక్ష్మీ అలంకరణలో శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అభిషేకం తర్వాత భక్తులకు అవతార దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరిగింది. సాయంత్రం మహిళల సామూహిక కుంకుమార్చన జరగ్గా.. సాయంత్రం మంత్రపుష్పం, తిరువీధి సేవ ఉత్సవాలు జరుగనున్నాయి.