అక్టోబర్ నెలలో కూడా వేడితో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాత్రి సమయంలోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రంలో నెమ్మదిగా చలి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరకున్నాయి.
రాష్ట్రంలోని చాలా చోట్ల ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అత్యల్పంగా హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండతో పాటు మెదక్, రామగుండంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్, భద్రాచలంలో మాత్రం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో మాత్రం 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం.
రుతు పవనాలు తిరుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి తెలంగాణలో శీతాకాలం కాస్త ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. అక్టోబర్ నెల ప్రారంభమైన తర్వాత కూడా ఎండలు భగ్గుమన్నాయి. చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నవంబర్ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇక ఉదయం 10 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. రాష్ట్రంలో చలికాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –