Politics

ఈ రాష్ట్రానికి వైకాపా అనే తెగులు పట్టుకుంది: పవన్‌

ఈ రాష్ట్రానికి వైకాపా అనే తెగులు పట్టుకుంది: పవన్‌

వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైకాపా నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని గతంలోనే చెప్పానని, రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని పవన్‌ తెలిపారు. తెదేపా-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం లోకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం. మద్యనిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఈ రాష్ట్రానికి వైకాపా అనే తెగులు పట్టుకుంది. ఆ తెగులు పోవాలంటే.. తెదేపా- జనసేన వ్యాక్సిన్‌ అవసరం. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే మేం కలిశాం. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం. తెదేపా-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని పవన్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ భేటీ: లోకేశ్‌

విజయదశమి రోజు తెదేపా-జనసేన సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ వైకాపా పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారు. బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. వైకాపా నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని లోకేశ్‌ అన్నారు.

ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. ‘‘ సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంది. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలు భేటీ అయ్యాం’’ అని లోకేశ్‌ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z