తెలంగాణలో దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్ స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు సీబీఎస్, దిల్‌షుక్‌నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్‌ల నుంచి కూడా ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. దసరా సందర్భంగా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
కలిసొచ్చిన డైనమిక్ ఛార్జీలు..
టీఎస్‌ఆర్టీసీ ఈసారి డైనమిక్ ఛార్జీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలోనే డైనమిక్ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ దసరా పండుగ సందర్భంగా ఇవి ఆర్టీసీకి కలిసొచ్చాయి. ప్రయాణికులు తక్కువ ఉన్న సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ వసూలు చేయడమే డైనమిక్ ఫేర్ ఉద్దేశం. ఇది ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. బెంగళూరు, విశాఖపట్టణం, విజయవాడ, చెన్నయ్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారు డైనమిక్ ఫేర్ ను ఎక్కువగా వినియోగించుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కో రీజియన్‌కు రూ.2.50 కోట్ల వరకు ఆదాయం..
పండుగ సందర్బంగా ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజులపాటు ప్రత్యేక బస్సులను నడిపించింది. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రోజూ ఆర్టీసీకి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. దసరా పండుగ సందర్భంగా ప్రతిరోజూ అదనంగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా రూ.19 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధంగా ఆర్టీసీకి గత 11 రోజుల్లో రూ.25 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 రీజియన్లు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ (ఇందులో రెండు రీజియన్లు) ఉన్నాయి. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
👉 – Please join our whatsapp channel here –