పండగ వేళ, శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మందికి అలవాటు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి పసిడి కొనుగోలు చేస్తాం కాబట్టి వాటి స్వచ్ఛత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూదు. హాల్‌మార్క్‌ను కేంద్రం తప్పనిసరి చేసిన నేపథ్యంలో బీఐఎస్ ధ్రువీకరణ పొందిన ఆభరణాలనే కొనుగోలు చేయాలి. ఒకవేళ స్వచ్ఛత విషయంలో అనుమానాలున్నా ‘బీఐఎస్ కేర్’ యాప్ ద్వారా మీరే స్వయంగా తనిఖీ చేయొచ్చు. అదెలాగంటే?
హెచ్‌యూఐడీ (HUID) కోడ్ ఉంటే చాలు..
అన్ని బంగారు ఆభరాణలకు ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (HUID) కోడ్‌ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి ఒక HUID నంబర్ కేటాయిస్తారు. ఈ కోడ్ ప్రతి ఆభరణానికి భిన్నంగా ఉంటుంది. (BIS) కేర్ యాప్‌ని ఉపయోగించి ఈ కోడ్ సాయంతో మీ బంగారం స్వచ్ఛమైనదో కాదో వెంటనే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బంగారం, వెండి రెండింటినీ ప్రభుత్వం హాల్‌మార్కింగ్ పరిధిలోకి తీసుకొచ్చింది.
హాల్‌మార్క్‌ను గుర్తించండిలా..
మీరు కొనుగోలు చేసిన ఆభరణంపై BIS హాల్‌మార్క్ మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఆభరణాలపై బీఐఎస్ ముద్ర, బంగారం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలతో) హెచ్‌యూఐడీ నంబర్ ఉందా? లేదా? అని విషయాన్ని తనిఖీ చేసుకోవాలి.
యాప్ సాయంతో..
- ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో ‘బీఐఎస్ కేర్’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- మీ పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, ఓటీపీతో లాగిన్ అవ్వండి.
- యాప్ ఓపెన్ కాగానే ‘verify HUID’ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ బంగారు ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్ అందులో ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ ఆభరణానికి సంబంధించిన హాల్‌మార్క్ చేయించిన దుకాణం, హాల్‌మార్క్ వేసిన కేంద్రం, ఆభరణం, దాని స్వచ్ఛత వంటి వివరాలు కనిపిస్తాయి. విక్రేత ఇచ్చిన బిల్లుతో ఆ వివరాలు సరిపోల్చుకోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –