ScienceAndTech

ఇద్దరు భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం

ఇద్దరు భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం

శాస్త్ర, సాంకేతిక (Science and Technology) రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇద్దరు భారతీయ-అమెరికన్‌ శాస్త్రవేత్తలకు అమెరికా అత్యున్నత శాస్త్రీయ అవార్డులు వరించాయి. అశోక్‌ గాడ్గిల్‌ (Ashok Gadgil)కు ప్రతిష్ఠాత్మక ‘నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’, సుబ్ర సురేశ్‌ (Subra Suresh)కు ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌’ పురస్కారాలు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఈ అవార్డులతో వారిని సత్కరించారు.

1950లో ముంబయిలో పుట్టిన అశోక్‌ గాడ్గిల్‌.. ముంబయి విశ్వవిద్యాలయం, ఐఐటీ కాన్పూర్‌ల నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీలు పొందారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 1980లో లారెన్స్ బర్క్‌లీ నేషనల్ లాబొరేటరీలో పనిచేసి రిటైరయ్యారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని సివిల్‌, పర్యావరణ ఇంజినీరింగ్‌ విభాగంలో గౌరవ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తక్కువ వ్యయంతో కూడిన సురక్షిత తాగునీటి సాంకేతికతలు, సమర్థవంతమైన ఇంధన స్టవ్‌లు, విద్యుత్తు దీపాల అభివృద్ధిలో కృషి చేశారు. ఆయన పరిశోధనా ఫలాలు 10 కోట్లకుపైగా ప్రజలకు మేలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకుగానూ గాడ్గిల్‌కు ఈ అవార్డును అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది.ముంబయికి చెందిన సుభ్ర సురేశ్‌ 1956లో జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌, లోవా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌, ఎంఐటీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అతి పిన్న వయస్కుడైన ఫ్యాకల్టీ సభ్యుడిగా చేరారు. అనంతరం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF)కు డైరెక్టర్‌ అయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా-అమెరికన్‌ సురేశ్‌ కావడం విశేషం. 2023లో బ్రౌన్‌ యూనివర్సిటీకి తిరిగివచ్చారు. ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్‌లో చేసిన పరిశోధనలు.. ముఖ్యంగా మెటీరియల్ సైన్స్‌లో అధ్యయనానికి గుర్తింపుగా ఆయన ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌’ను అందుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z