Politics

వైఎస్ మరణ సమయంలో చెప్పిన లెక్కలన్నీ బోగస్: రఘురామ

వైఎస్ మరణ సమయంలో చెప్పిన లెక్కలన్నీ బోగస్:  రఘురామ

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని తట్టుకోలేక 1000 నుంచి 1500 మంది చనిపోయినట్టుగా తమ పార్టీ చెప్పినవే బోగస్‌ లెక్కలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నాటి మరణాలు బోగస్‌వని ఒప్పుకోవాలని ఆయన సూచించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెదేపా కార్యకర్తలు, ఆయన అభిమానులు కలత చెంది మృతి చెందారనేది నిజమన్నారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా నాయకులు కూడా తప్పుడు లెక్కలు చెప్పాలనుకుంటే 1000 నుంచి 1500 మంది చనిపోయారని చెప్పి ఉండేవారని, అలా కాకుండా వివరాలన్నీ తెలుసుకొని వాస్తవ సంఖ్యలు చెప్పారని ఆయన తెలిపారు. ఒక మహిళ కష్టాల్లో ఉండి, దేవుడిని దర్శించుకుని ప్రజలకు నిజం చెప్పాలని భావిస్తే, సాటి మహిళగా మంత్రి రోజా పేరడీ చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ మండిపడ్డారు. నిజంగానే నిజం గెలిస్తే భువనేశ్వరితో పాటు లోకేశ్‌ కూడా అరెస్ట్‌ అవుతారని పేర్కొనడం చూస్తుంటే ఆమె ఎంత అక్కసుతో మాట్లాడుతున్నారో అర్థమవుతోందన్నారు. మంత్రి రోజా వ్యవహార శైలిని ఏ మహిళా హర్షించరని తెలిపారు. భువనేశ్వరి చేపడుతున్న ‘నిజం గెలవాలి’ యాత్రకు మహిళలు నీరాజనాలు పలుకుతారని ఎంపీ అన్నారు. సామాజిక సాధికారిక యాత్ర పేరిట ఎస్సీ, ఎస్ట్టీ, బీసీ మంత్రులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి యాత్రలు చేపడతామంటున్నారని, ఈ సందర్భంగా వచ్చే మంత్రులను డాక్టర్‌ సుధాకర్‌ ఎలా మరణించారు? డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వ్యక్తికి ఏ శిక్ష పడింది? దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసు ఏమైంది? హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంగా ఓ దళిత యువకుడిని చంపేసిన ఘటనను, తన సోదరిని వేధించవద్దని ప్రాధేయపడిన బాలుడిని కాల్చి చంపిన నిందితుడికి ఏ శిక్ష విధించారో చెప్పాలని కోరాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z