Business

ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు బిగ్‌ షాక్‌- వాణిజ్య వార్తలు

ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు బిగ్‌ షాక్‌- వాణిజ్య వార్తలు

ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు బిగ్‌ షాక్‌

ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు బిగ్‌ షాక్‌. పన్ను ఎగవేతకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల ట్యాక్స్‌ నోటీసులు జీఎస్టీ అధికారులు ఇప్పటి వరకు ఆయా సంస్థలకు పంపించారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్‌ 1 తర్వాత కొత్తగా విదేశీ గేమింగ్‌ కంపెనీలు దేశంలో రిజిస్టర్‌ అయినట్లు డేటా ఏదీ లేదని సదరు అధికారి తెలిపారు.ఆన్‌లైన్‌ గేమింగ్ కంపెనీలకు సంబంధించి జీఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. విదేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు అక్టోబర్‌ 1 నుంచి తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్‌ అవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పెట్టే మొత్తం విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ విషయంలోనే గేమింగ్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్‌ 1 నుంచే పెంచిన 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గేమింగ్‌ కంపెనీలు పేర్కొంటుండగా.. చట్టం ఇది వరకే అమల్లో ఉందని ప్రభుత్వం చెప్తోంది.ఈ క్రమంలోనే డ్రీమ్‌ 11, డెల్టా కార్పొరేషన్‌ వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలకు గత నెలలోనే షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పాటు రూ.21వేల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో గేమ్స్‌ క్రాఫ్ట్‌కు వేరేగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, దీనిపై కర్ణాటక హైకోర్టును సదరు కంపెనీ ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జులైలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

* హాట్‌ కేకుల్లా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాలు‌

దసరా సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు (Ola Scooter) హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రతి 10 సెకండ్లకు ఒక బైక్‌ చెప్పున అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఓలా సీఈవో (Ola CEO) భవిష్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి 10 సెకండ్లకో వాహనం అమ్ముడుపోయినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2.5 రెట్లు ఎక్కువగా బైక్స్‌ అమ్ముడైనట్లు తెలిపారు.కాగా, దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశీయ నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయదారు ఓలా ఎలక్ట్రిక్ భారత్ ఈవీ ఫెస్ట్ పేరుతో అక్టోబర్ 16న ప్రత్యేకమైన సేల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫెస్ట్‌లో భాగంగా స్పెషల్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌, ప్రత్యేక డిస్కౌంట్‌లు, బ్యాటరీపై వారెంటీ పొడిగింపు వంటివి అందిస్తోంది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు అదనపు ఆఫర్లు, తగ్గింపులను అందించింది. అక్టోబర్ 22 నుంచి 24 మధ్య 72 గంటల ఎలక్ట్రిక్ రష్ పేరుతో దీనిని నిర్వహించింది. ఈ ఆఫర్‌ మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది.

* నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం సెషన్లో 523 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 64,049కు చేరింది. మరోవైపు నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 19122 వద్ద స్థిరపడింది. మార్కెట్లలో పండగ జోష్ కనిపించలేదు. రియాల్టీ, ఐటీ, ఫైనాన్స్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ టాప్ 30లో టాటా స్టీల్, ఎస్బీఐ, ఎం&ఎం, మారుతీ, నెస్లే, JSWస్టీల్ మినహా మిగతా షేర్లు నష్టాలు నమోదు చేశాయి.

* దేవ్‌భూమిలో ముకేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్​అధినేత ముకేశ్​అంబానీ దేవ్‌భూమిని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయం (Dwarkadhish Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముకేశ్‌ అంబానీ.. తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani )తో కలిసి గుజరాత్‌ రాష్ట్రం దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు మంగళవారం వెళ్లారు. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని సందర్శించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీకి శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

* ఉబర్‌ డ్రైవర్‌గా మారిన గూగుల్‌ మాజీ ఉద్యోగి

ఒక ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయడం ఇప్పుడు అన్ని నగరాల్లో జరిగేదే. ఇందుకోసం ఉబర్‌, ఓలా డ్రైవర్ల గానో.. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌గానో అవతారం ఎత్తడం చూస్తూనే ఉంటాం. అయితే, లక్షల్లో జీతం అందుకునే వారు, ప్రముఖ కంపెనీల్లో పనిచేసేవారు ఇలా పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేయడం అరుదు. కానీ బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి మాత్రం ఉబర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న గూగుల్ మాజీ ఉద్యోగి పరిచయం అయ్యాడు. అయితే, ఆదాయం కోసం అతడు అలా చేస్తున్నాడనుకుంటే పొరపాటే. మరి ఇంతకీ ఆయన డ్రైవర్‌ అవతారం ఎందుకు ఎత్తాడు? రాఘవ దువా అనే వ్యక్తి బెంగళూరులో ఉబర్‌ మోటో రైడ్‌ని బుక్ చేసుకున్నాడు. అలా బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌ డ్రైవర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాడు. వాటిని తన ‘ఎక్స్‌’ ఖాతాలో తాజాగా పంచుకున్నాడు. ‘గూగుల్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగే నా ఉబర్‌ డ్రైవర్‌. 20 రోజుల కిందటే హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకి వచ్చాడు. నగరంలో పర్యటించాలనుకున్నాడు. అందులో భాగంగానే ఇలా ఉబర్ డ్రైవర్‌గా మారాడట’ అని రాఘవ్‌ రాసుకొచ్చారు. దాంతో పాటూ నాలుగు సెకన్ల నిడివి గల వీడియోను కూడా పంచుకున్నాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘గూగుల్‌ మాజీ ఉద్యోగులు కూడా ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండే ప్రదేశం ఇది’ అంటూ బెంగళూరునుద్దేశించి ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘నాక్కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది’ అని ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా.. ‘నగరాన్ని చూడాలనుకుంటే ఇతర మార్గాలున్నాయి. దాని కోసం డ్రైవర్‌గా మారటం వల్ల సమయం వృథా’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z