DailyDose

వాషింగ్ మెషిన్లలో 500 నోట్లు కట్టలు-నేర వార్తలు

వాషింగ్ మెషిన్లలో 500 నోట్లు కట్టలు-నేర వార్తలు

* వాషింగ్ మెషిన్లలో 500 నోట్లు కట్టలు

వాషింగ్ మెషీన్లతో ఓ సుజుకీ వాహనం వెళ్తుంది. దాని వెనుక ఒక యువకుడు ఫైలెట్‌గా బైక్‌పై వెళ్తున్నాడు. ఆటోలో మరో యువకుడు సైతం ఉన్నారు.వీరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వాహనం ఆపి ఆరా తియ్యగా వాషింగ్ మెషీన్లను విజయవాడ తరలిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పోలీసుల అనుమానం మరింత రెట్టింపైంది. విశాఖ పట్నం నుంచి పరిసర ప్రాంతాల్లోకి వాషింగ్ మెషీన్లు తరలిస్తే ఒకే కానీ ఇక్కడ నుంచి విజయవాడకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. అనుమానంతో వాషింగ్ మెషీన్లు తనిఖీ చేయగా పోలీసుల ఫీజులు ఎగిరిపోయేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఎన్ఏడీ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఆరు వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. వాషింగ్ మెషీన్లో గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడటంతో అన్నింటిని తనిఖీ చేశారు. మెుత్తం రూ.1.30 కోట్లు విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటితోపాటు 30 మొబైల్ ఫోన్లు కూడా లభించాయి. దీంతో పోలీసులు వాహనాన్ని, డబ్బు, మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అయితే వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు ఉన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే నగదుకు సంబంధించి ఇతర పత్రాలు ఇవ్వాలని పోలీసులు కోరగా అసలు తమకేమీ తెలియదన్నారు. మెుబైల్ ఫోన్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారని ప్రశ్నించగా వీటి గురించి తనకు ఏమీ తెలియదని ఆటో డ్రైవర్ బోరున విలపించారు. ఇంతలో విశాఖకు చెందిన ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆ నగదును విజయవాడలోని బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉందని అందుకే అందులో తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే సమాధానం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు ఆటోను, బైక్‌ సీజ్ చేశారు. నగదు, మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాషింగ్ మెషీన్లలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరకడంపై చర్చనీయాంశంగా మారింది.

* దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం

కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం సమయంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఉత్సవంలో ఇద్దరు మృతి చెందగా.. సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ బన్నీ ఉత్సవంలో మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. కాగడాల దివిటీలను గాల్లోకి ఎగరేయడంతో పలువురికి కాలిన గాయాలయ్యాయి.

* బీజేపీ ప్రభుత్వంపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి వైద్య పరీక్షలు చేయగా 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకినట్టు తెలిసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికార బీజేపీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. డబుల్ ఇంజిన్ సర్కారులో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.కాన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలోని లాలా లజపతిరాయ్ హాస్పిటల్‌లో 14 మంది పిల్లలకు రక్త మార్పిడి చేయగా.. 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకినట్టు తెలిసింది. రక్తం ఎక్కించిన తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీలు సోకినట్టు తెలిసింది.డబుల్ ఇంజిన్ సర్కారు రోగాలను డబుల్ చేస్తున్నదని మల్లికార్జున్ ఖర్గే ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తలసేమియాతో బాధపడుతున్న 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని అందించారని ఫైర్ అయ్యారు. సర్కారు చేసిన తప్పునకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు.బాధిత పిల్లల వయసు ఆరేళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఉన్నది. ఏడుగురికి హెపటైటిస్ బీ, ఐదుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు సమాచారం

* ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ

రంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి పొగమంచు కారణమా..? లేక డ్రైవర్ల నిద్రమత్తుతో ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

* ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలపై వాకింగ్

మక్తల్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఎడమ చేతిని కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి ప్రతి రోజు మాదిరిగానే.. వాకింగ్ వెళ్లాడు. అయితే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ పై నడుస్తూ వెళ్ళాడు. అదే సమయంలో రైలు వచ్చి అతన్ని ఢీ కొట్టింది. దీంతో నవీన్ కుమార్ తన ఎడమ చేయి శరీరం నుంచి విడిపోయి పట్టాలపై పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ఆ యువకుడిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

* దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో అగ్నిప్రమాదం

దుర్గామాత విగ్రహ నిమ్మజన ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు సమయంలో ఒక్క సారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో తొమ్మిది మంది చిన్నారలకు గాయాలు అయ్యాయి. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. దేవీ నవరాత్రులు ముగింపు అనంతరం దసరా సందర్భంగా సతారా జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ మహాబలేశ్వర్ లోని కోలి ఆలీ ప్రాంతాంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. దుర్గామాతను అలంకరించిన ఓ వాహనంలో ఉంచి ఊరేగింపు చేపడుతున్నారు. అందులోనే లైటింగ్ కోసం ఓ జనరేటర్ ను కూడా అమర్చారు. భక్తులు డ్యాన్స్ లు చేస్తుండగా.. చక్కగా ఊరేగింపు సాగిపోతోంది.అయితే సాయంత్రం సమయంలో వాహనంలో ఉన్న జనరేటర్ వేడెక్కింది. దాని పక్కనే పెట్రోల్ తో నిండిన క్యాన్ ఉండటంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనంలో ఓ మూల కూర్చున్న తొమ్మిది మంది చిన్నారులకు కాలిన గాయాలు అయ్యాయి. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై, క్షతగాత్రులను సతారా, పుణెలోని హాస్పిటల్ కు తరలించారు. పిల్లలందరీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎస్పీ సమీర్ షేక్ చెప్పారు.

* రాజస్థాన్‌లో దారుణం

ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ట్రాక్టర్‌ను 8 సార్లు సోదరుడిపై నడిపి ఆ వాహనంతో తొక్కి చంపాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. (Rajasthan brutal Murder) బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉంది. బుధవారం ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్‌పై వివాదాస్పద పొలం వద్దకు చేరుకున్నది. కొంతసేపటికి అతర్ సింగ్ కుటుంబం కూడా అక్కడకు వచ్చింది. దీంతో భూ వివాదంపై ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.కాగా, ఈ ఘర్షణలో అతర్ సింగ్ కుమారులలో ఒకడైన నిర్పత్ నేలపై పడ్డాడు. ఇంతలో సోదరుడి వరుసైన దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్‌పై నడిపాడు. ముందుకు, వెనక్కి 8 సార్లు ట్రాక్టర్‌ను నడిపి ఆ వాహనంతో తొక్కి చంపాడు. మిగతా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడు వినిపించుకోలేదు.మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు దామోదర్‌ను అరెస్ట్‌ చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇరు కుటుంబాల ఘర్షణలో గాయపడిన పది మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, సోదరుడ్ని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.

* ఎట్టకేలకు మృతదేహం లభ్యం

పినపాక మండలం రావిగుడానికి చెందిన చిట్టిమల్ల సురేష్ రెండు రోజుల క్రితం బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్లి గోదావరిలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం సురేష్ మృతదేహం అశ్వాపురం మండలంలోని పాములపల్లి గోదావరి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన జాలరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోటు సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z