క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. క్యాన్సర్ మాట వింటేనే హడలిపోతాం. ఇక అది సోకినవారికి..వారి కుటుంబం సభ్యుల బాధ వర్ణనాతీతం. దాని చికిత్స కూడా ఖరీదైనదే. క్యాన్సర్ మహమ్మారి సోకితే ఇక జీవితంమీద ఆశలు వదిలేసుకున్నట్లే. చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేనివారి పరిస్థితి దాదాపు అదే. ఎంతో ఆత్మస్థైర్యం ఉంటే తప్ప దాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం. ఓ పక్క చికిత్స మరో పక్క మానసిక స్థైర్యం ఉంటే తప్ప ఎదుర్కోలేం. తొలి దశలో గుర్తిస్తే ప్రాణాలతో బయటపడవచ్చని నిపుణులు చెబుతుంటారు. శ్రీమంతులైతే విదేశాలల్లో ఆధునిక చికిత్సలతో ప్రాణాలతో బయటపడే అవకాశాలున్నాయి. కానీ సామాన్యులు, పేదవారికి ఇటువంటి వ్యాధులు సోకితే చికిత్స ఖర్చు భరించే స్థోమత లేక.. మెలిపెట్టే బాధను భరిస్తు చావు కోసం ఎదురు చూస్తే కాలం వెళ్లదీస్తూ ఉంటారు.
అటువంటి క్యాన్సర్‌లలో చాలా రకరకాలు ఉన్నాయి. వాటిలో చర్మ క్యాన్సర్ కూడా ఒకటి. అటువంటి చర్మ క్యాన్సర్ కు సబ్బును కనిపెట్టాడు 14 ఏళ్ల కుర్రాడు. స్కిన్ క్యాన్సర్ చికిత్స కోసం సబ్బును తయారు చేశాడు అమెరికాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు హేమన్ బెకెలే. క్యాన్సర్ చికిత్సల కోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారినుంచి ప్రజల్ని కాపాడాలని ఎన్నాళ్లగానో కృషి చేస్తున్నారు. కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలు చేయలేని గొప్ప ఘనత సాధించాడు ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని ఫ్రాస్ట్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల హేమన్ బెకెలే.చర్మ క్యాన్సర్ చికిత్సకు సబ్బు కనిపెట్టాడు.
2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో తొమ్మిదిమందితో పోటీ పడి అమెరికా టాప్ యంగ్ సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ పోటీలో హేమన్ 25 వేల డాలర్లు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో దాదాపు రూ.31 లక్షలు. చర్మ క్యాన్సర్ చికిత్స కోసం హేమన్ తయారు చేసిన ఈ సబ్బు ధర కేవలం 10 డాలర్లు మాత్రమే కావటం మరో విశేషం. భారత కరెన్సీలో రూ.830లు. అత్యంత తక్కువ ధరకే చర్మ క్యాన్సర్ కు చెక్ పెట్టే సబ్బును రూపొందించాడు ఈ యంగ్ సైంటిస్ట్.
చర్మ క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఈ సబ్బును యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో ప్రదర్శించాడు హేమన్. ఈ సందర్భంగా హేమన్ మాట్లాడుతు.. ఈ సబ్బు చర్మాన్ని రక్షించే కణాలను తిరిగి పెంపొందిస్తుందని.. దీంతోపాటు క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే వారికి తగిన శక్తిని అందిస్తుందని తెలిపాడు. ఇది అందరికి అందుబాటులో ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు. చర్మ క్యాన్సర్ గురించి ఇంకా పరిశోధనలు చేయాలని అనుకుంటున్నానని వెల్లడించాడు. ఈ సబ్బుకు ‘స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్’ అని పెట్టానని తెలిపాడు. మార్కెట్లో అనేక క్రీములు ఉన్నా..క్యాన్సర్ చికిత్సకు సబ్బు అనేది ఇప్పటి వరకు లేదని..ఇదే మొదటిది అని తెలిపాడు. తాను నాలుగేళ్ల వయస్సులో ఇథియోపియా నుంచి అమెరికా వచ్చానని చిన్ననాటే తాను ఎండలో పనిచేసేవారిని చూసానని తాను చదువుకునే సమయంలో అది గుర్తుకొచ్చి ఈ సబ్బు రూపకల్పన చేశానని ఇది అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాని వెల్లడించాడు.
ఈ సబ్బు కోసం మేమన్ కంప్యూటర్ మోడలింగ్ ను ఉపయోగించి దానికి సంబంధించిన సూత్రాన్ని రూపొందించాడు. ఈ స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్ డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరించడానికి ఉపయోగపడే సమ్మేళనాలను ఉపయోగించడం ద్వారా పనిచేస్తుందని హేమన్ మెంటార్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ డెబోరా ఇసాబెల్లె తెలిపారు. డెన్ట్రిటిక్ కణాల పునరుద్దరణ తర్వాత అవి.. స్కిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయని తెలిపాడు. స్కిన్ క్యాన్సర్ నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయాన్ని శరీరానికి గుర్తు చేస్తుందని తెలిపాడు.
ఇప్పటికే మెడికల్ మార్కెట్లో స్కిన్ క్యాన్సర్ కోసం అనేక క్రీమ్‌లు ఉన్నాయని.. అయితే స్కిన్ క్యాన్సర్ చికిత్సకు సబ్బును ఎప్పుడూ ఉపయోగించలేదని ఇదే మొదటిసారి అని హేమాన్ తెలిపాడు. క్యాన్సర్‌ను జయించాలనే ఆశ, చికిత్సను అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచానికి చిహ్నంగా మార్చాలనుకుంటున్నామని ప్యానెల్ సభ్యులకు హేమన్ వెల్లడించాడు.
కాగా 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో హేమన్ తో పాటు కాలిఫోర్నియాలోని శాన్ జోన్ నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీ ప్రియ కల్భవి అనే బాలిక కూడా పాల్గొంది. ఆమె తన ఆవిష్కరణలో సెకండ్ ప్లేస్ లో నలిచింది. అలాగే మసాచుసెట్స్ లోని అండోవర్ కు చెందిన ఏడవ తరగతి చదివే సారా వాంగ్ అనే విద్యార్ధిని కూడా పాల్గొంది.
👉 – Please join our whatsapp channel here –