DailyDose

సైలెంట్ వాకింగ్ గురించి మీకు తెలుసా?

సైలెంట్ వాకింగ్ గురించి మీకు తెలుసా?

నెట్టింట ఎప్పుడేది ట్రెండ్‌ అవుతుందో చెప్పలేం. ఆ మధ్య ‘క్వైట్‌ క్విట్టింగ్‌’.. అంటూ జెన్‌ జడ్‌ (Generation Z) వ్యక్తులు ఒక దాన్ని ట్రెండ్‌ చేశారు. వృత్తి జీవితంలో తన పని వరకు మాత్రమే పరిమితం కావడం. సోమవారాలు పెద్దగా పని భారం పెట్టుకోకుండా ఉండేందుకు ‘బేర్‌ మినిమమ్‌ మండేస్‌’ అంటూ మరో కొత్త ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మరో లేటెస్ట్‌ ట్రెండ్‌ ‘సైలెంట్‌ వాకింగ్‌’ (Silent Walking) తీసుకొచ్చారు. పేరులో ఉన్నట్లు టెక్నాలజీకి దూరంగా ఉండి వాక్‌ చేయడం దీని ఉద్దేశం. ఇంతకీ ఇదెలా స్టార్ట్‌ అయ్యింది?

అమెరికాకు చెందిన మ్యాడీ మే అనే పాడ్‌కాస్టర్‌ ఈ సైలెంట్‌ వాకింగ్‌ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారనే చెప్పాలి. నడక సమయంలో టెక్నాలజీకి దూరంగా ఉండాలని తన జీవిత భాగస్వామి సూచించడంతో తాను దీన్ని మొదలు పెట్టినట్లు మ్యాడీ చెప్పారు. వాకింగ్‌ వెళ్లేటప్పుడు ఎయిర్‌పాడ్స్‌, పాడ్‌కాస్ట్‌లు, మ్యూజిక్‌ వంటి వాటికి దూరంగా ఉండడం మొదలు పెట్టానని పేర్కొన్నారు. తొలుత ఇలా చేయడానికి కాస్త కష్టంగా అనిపించినా.. క్రమంగా అలవాటైందని ఓ టిక్‌టాక్‌ వీడియోలో చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. 5 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

‘సైలెంట్ వాకింగ్‌లో తొలి రెండు నిమిషాల నడక.. కాస్త అయోమయంగా అనిపించినా కాసేపయ్యాక మీకు అర్థమవుతుంది. విశ్వం, మీ హృదయాంతరాల నుంచి కొన్ని గుసగుసలు మీకు వినిపిస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉండండి. అప్పుడప్పుడూ మీ హృదయం లోలోతుల నుంచి వచ్చే గుసగుసలను వినండి. లేదంటే అవి కోల్పోతారు. ఒంటరిగా నడవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. టెక్నాలజీని దూరం పెట్టడం ద్వారా మెదడుకు అందుకు కావాల్సిన స్థలం ఇస్తున్నాం. నిశ్శబ్దంగా నడవడం వల్ల ప్రతిదీ వినగగులుతున్నా, ఆస్వాదించగలగుతున్నా.. ప్రతిదీ చూడగలుగుతున్నా. నేను ప్రయత్నించాను. వీలైతే మీరూ చేయండి’’ అంటూ మ్యాడీ తన వీడియోలో పేర్కొన్నారు.

న్యూయార్క్‌ సిటీకి చెందిన ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సైతం గతంలో ఇదే విషయమై ఓ వీడియో చేశారు. ఒంటరిగా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను అప్పట్లోనే చెప్పారు. ఎందుకో అంత ప్రాచుర్యంలోకి రాలేదు. మ్యాడీ వీడియో వైరల్‌గా మారడంతో కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఈ ట్రెండ్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌ ఉందని కొందరు పోస్టులు పెడుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో లేని కాలం ప్రజలు ఇలానే వాకింగ్‌కు వెళ్లేవారుగా.. ఇందులో కొత్తేమీ ఉందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ‘మొత్తానికి జెన్‌ జడ్‌ వాకింగ్‌ ఎలా చేయాలో ఇన్నాళ్లకు కనుగొన్నారు’ అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్‌ పెట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z