కొంతమంది ఆడవారు ఏ మేకప్ లేకుండా జస్ట్ కళ్ల నిండా కాటుక పెట్టుకుంటే చాలు చాలా అందంగా కనిపిస్తారు. నిజానికి ఎంత మేకప్ చేసుకున్నా కాటుక లేకుండా కంప్లీట్ కాదు. మార్కెట్లో రకరకాల కాజల్స్ డబ్బులు పోసి కొంటాం. కానీ వాటి వల్ల కంటికి ఎఫెక్ట్ అవ్వచ్చు. అవేం అక్కర్లేకుండా ఎటువంటి రసాయనాలు కలపని కాటుకను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే?
రోజు కంటికి కాటుక పెట్టుకోవడం ఎంతో మంచిది. దుమ్ము, ధూళితో దుష్ప్రభావాలు కళ్లపై పడకుండా కాటుక కాపాడుతుంది. అంతేకాదు కళ్ల మంటల్ని కూడా కాటుక తగ్గిస్తుంది. ఇక కాటుక పెట్టుకున్న ఆడవారి అందం రెట్టింపవుతుంది. ఆడవారు బయటకు వెళ్లేటపుడు ఖచ్చితంగా కాజల్ పెట్టుకుంటారు. అందుకోసం బోలెడు డబ్బులు పెట్టి మార్కెట్లో దొరికే రకరకాల కాజల్స్ కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి అవి పడకపోతే కంటికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా ఇంట్లోనే మనం కాజల్ తయారు చేసుకోవచ్చును.
మూడు చిన్న రాళ్లు తీసుకుని మధ్యలో ప్రమిద ఉంచాలి. అందులో మందంగా ఉండే ఒత్తిని వేసి అందులో ఆముదం వేసి వెలిగించాలి. ఆ రాళ్లపై రాగి లేదా ఇత్తడి ప్లేటును బోర్లించాలి. ఓ రోజంతా ఆ దీపం వెలుగుతూ ఉండాలి. మధ్యలో ఆముదం అయిపోకుండా పోస్తూ ఉండాలి. ఆ తర్వాత బోర్లించిన పళ్లెం తీసి చూస్తే నల్లటి పొడిలాగ అంటుకుని ఉంటుంది. అందులో కొంచెం ఆముదం వేసి ముద్దలా చేయాలి. ఆముదం ఎక్కువ వేస్తే కాటుక పెట్టకోగానే పాకిపోతుంది. అందుకు చాలా తక్కువగా ఆముదం వేయాలి. ఆ ముద్దను భరిణిలో పెట్టుకుని రోజు పెట్టుకుంటే కళ్లకు ఎంతో మంచిది.
కాటుక తయారు చేయడానికి మరో పద్ధతి కూడా ఉంది. మూడురాళ్లను పొయ్యిలాగ చేసి మధ్యలో ఆముదపు దీపాన్ని వెలిగించాలి. దానిపై రాగి ప్లేటును బోర్లించాలి. పైన బాదం గింజలను పెట్టాలి. రెండు గంటలు అలా వదిలేశాక ప్లేటు నల్లగా అయిపోయాక బాదం గింజల్ని మెత్తగా నూరాలి. ప్లేటుకి ఉన్న మసిని కూడా తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కలపి ఆముదం, లేదా నెయ్యితో గట్టి ముద్దలా చేసుకోవాలి. ఒక భరిణెలో పెట్టుకుని రోజు కళ్లకు పెట్టుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.
👉 – Please join our whatsapp channel here –