Business

యువతకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సలహా

యువతకు ఇన్ఫీ నారాయణ మూర్తి సలహా

ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) అన్నారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవలగలదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 3వన్‌4 క్యాపిటల్‌ తొలి పాడ్‌కాస్ట్‌ ‘ది రికార్డ్‌’ అనే ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణం, టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌ సహా పలు అంశాల గురించి మాట్లాడారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశంలో ఉత్పాదకత తక్కువని నారాయణ మూర్తి (Narayana Murthy) ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే యువత అదే తరహాలో పనిచేయాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి అన్నారు.‘ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. మన దేశంలో ఉత్పాదకత పెరగకుండా.. ప్రభుత్వంలో ఒక స్థాయిలో వేళ్లూనుకున్న అవినీతిని తగ్గించకుండా.. అధికార నిర్ణయాల్లో జాప్యం తొలగకుండా.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం సాధ్యం కాదు. కాబట్టి ‘యువత ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను’ అనే ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపానీయులు ఇదే పనిచేశాయన్నారు. ప్రతి జర్మన్‌ అదనపు గంటలు పనిచేయాలని నిర్ణయించుకుని కొన్నేళ్ల పాటు ఆ పనిచేశారని గుర్తుచేశారు.