న్యూజెర్సీ శ్రీదత్తపీఠంలోని శ్రీశివవిష్ణు ఆలయంలో దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్టోబర్ 15 నుంచి 24 వరకు ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరిగాయి. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 15న హేరంభ గణపతి పూజా అభిషేకం, అక్టోబర్ 16న పంచముఖ పరమశివ అభిషేకం, అక్టోబర్ 17న హనుమాన్ అభిషేకం నిర్వహించారు. అక్టోబర్ 19న సామూహిక లక్ష కుంకుమార్చన జరిగింది. కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత సువాసినీ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం అదే రోజున హోమం నిర్వహించారు. అక్టోబర్ 20న శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారై మహిళలు ఈ పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడి సందడి చేశారు.అక్టోబర్ 21న చిన్నారుల కోసం అక్షర స్వీకారం, అక్టోబర్ 22న చండీ హోమం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పదో రోజు జరిపిన దసరా సంబరాలు అంబరాన్ని తాకాయి. లక్ష పుష్పార్చన కార్యక్రమం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై బాబా సేవలో తరించారు. దేవి నవరాత్రి వేడుకల్లో ప్రవాస తెలుగువారు కుటుంబ సమేతంగా పూజల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ దత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి దేవీ నవరాత్రులను ఎంతో వైభోగంగా నిర్వహించారు. అమ్మవారిని శక్తిస్వరూపంగా తలచి స్తోత్రపాఠాలతో వేడుకగా పూజలు జరిపించారు. దేవీ అనుగ్రహం ప్రతి ఒక్కరిపైనా ఉండాలని రఘుశర్మ శంకరమంచి ప్రార్థించారు.