చిరంజీవి (Chiranjeevi), సోనాలి బింద్రే (Sonali Bindre) జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S). 2004లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నవంబర్ 4న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. నాగబాబు, శ్రీకాంత్ ఇందులో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు అవుతోంది. కొన్ని చిత్రాలను మనం థియేటర్‌లోనే వీక్షించి అనుభూతి చెందాలి. అలాంటి చిత్రమే ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్’. రీ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే అన్నయ్య ఎనర్జీ.. శ్రీకాంత్ – పవన్‌కల్యాణ్ షాట్స్.. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్.. ఇలా ఆనాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే నా ఆప్త మిత్రుడు ఆహుతి ప్రసాద్ ఇప్పుడు మన మధ్య లేరు. ట్రైలర్‌లో అతడిని చూస్తుంటే భావోద్వేగంగా అనిపించింది. ఇలా ఈ ట్రైలర్ ఆనందంతోపాటు భావోద్వేగానికి గురి చేసింది’’ అని నాగబాబు అన్నారు.శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2004.. ఆ సంవత్సరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య (చిరంజీవి)తో కలిసి నటించాలని ఎన్నో కలలు కనేవాడిని. ‘మున్నాభాయ్’ చిత్రాన్ని తెలుగులో అన్నయ్యతో రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు.. ఆయనకు ఫోన్ చేశా. ఒరిజినల్‌లో చూపించిన విధంగా హీరో పక్కన ఉండే కమెడియన్ పాత్ర కోసం ఎవరిని ఎంచుకున్నారని.. అలాగే, నేను చేస్తే ఎలా ఉంటుందని అడిగా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. కట్ చేస్తే.. మరుసటి రోజు జెమిని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏటీఎం పాత్ర కోసం నన్ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో సంతోషించా. అన్నయ్యతో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. ఆ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్‌లోనూ ఇది పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని శ్రీకాంత్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –