Politics

రెండో జాబితాపై తంటాలు పడుతున్న కాంగ్రెస్

రెండో జాబితాపై తంటాలు పడుతున్న కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తోంది. రెండో జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనలు పడుతోంది. స్క్రీనింగ్‌ కమిటీ నుంచి అందిన జాబితాపై సుదీర్ఘంగా చర్చించిన సీఈసీ.. వామపక్షాల సీట్ల సర్దుబాటుతో పాటు ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై స్థానిక నాయకులు ఏకాభిప్రాయానికి రావాలని పీసీసీకి సూచించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

ఖమ్మం విషయంలో.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య ఐక్యత కొరవడడంతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ ముగ్గురు నాయకులు కూడా ఎవరికి వారు.. తాము కోరుకున్న స్థానాలు తమకు కావాల్సిందేనని పట్టుబడుతున్నట్టు సమాచారం. ముగ్గురూ ముఖ్యనేతలు కావడంతో.. వారందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చేందుకు ఏకంగా అధిష్ఠానమే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్‌ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా.. శుక్రవారానికి వాయిదా పడింది. మొత్తం 64 నియోజకవర్గాల టికెట్లపై రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించడంతో సీఈసీకి పూర్తి స్థాయిలో పట్టు వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z