ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. అయితే, పాలేరులో స్వర్గీయ రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికల్లో అయన సతీమణికి టికెట్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు అడ్డుపడి నేనే పోటీ చేస్తానని నన్ను బ్రతిమాలితే.. టికెట్ ఇచ్చి మేమంతా దగ్గర వుండి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అని తుమ్మల అన్నారు. నిజానికి ఆరోజు పాలేరు నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను పోటీ చేశానన్న సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
ఈరోజు నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఎంత వరకు సమంజసం కేసీఆర్ అని తుమ్మల నాగేశ్వరరావు అడిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అనే నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు మీ పార్టీకి జెండా పట్టే కార్యకర్త లేడు.. కేవలం నేను పార్టీలో జాయిన్ అయిన తరువాత 280 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటి అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీతో సహా వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి మీ సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి మర్చిపోయి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఆయన ధ్వజమెత్తారు.
అసలు 2018 ఎన్నికల్లో పాలేరులోలో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు అని తుమ్మల అన్నారు. పువ్వాడ అజయ్ ని మంత్రిని చేయడం కోసం.. ధనదాహంతో ఆయనతో కలిసి వ్యాపారాలు, హైదరాబాద్ బాచుపల్లిలో మమత మెడికల్ కాలేజీ పెట్టుకోవడం కోసం స్వయంగా నీ కొడుకే నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడించింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా ఎన్నికలకు నెల రోజుల ముందు టికెట్లు కేటాయించి నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా?.. పార్టీలో జరుగుతున్న అణ్యధోరణులను ఎప్పటికప్పుడు మీకు చెప్పినప్పటికీ మీరు పెడచెవిన పెట్టి పార్టీని భ్రష్టుపట్టిపోవడానికి కారణం మీరు కాదా?.. ఇంత జరిగినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఎవరిని సంప్రదించకుండా ఆప్పటికపుడు నామా నాగేశ్వరరావుకు ఎంపీ టికెట్ కేటాయిస్తే పార్టీకి కట్టుబడి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించింది నిజం కాదా?.. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను చేసిన కృషి చేసింది మీకు తెలియదా? అని తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ను ప్రశ్నించారు.
మీరు స్వయంగా భక్త రామదాసు ప్రాజెక్ట్ ప్రారంభానికి వచ్చినపుడు సభలో అపర భగీరథున్ని నేను కాదు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అని నా గురించి మీరు ఆన్న మాటలు ఇంకా పాలేరు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని మీరు నాకు ఇచ్చిన కితాబు ఇంకా పాలేరు ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉందనే విషయం మర్చిపోయి మీరు నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం అంటూ ఆయన వ్యాఖ్యనించారు. 40 సంవత్సరాల మన ఇద్దరి సహవాసంలో నేనేంటో.. నా నిబద్దత ఏమిటో తెలిసి కూడా నా పార్టీ మార్పు గురించి ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడటం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
👉 – Please join our whatsapp channel here –