మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా నెలలు గడుస్తున్నాఇంకా రిలీజ్ డేట్ రాకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనానికి లోనవుతున్నారు. అందుకే చెర్రీ అభిమానులను కాస్త శాంత పరిచేలా ఈ మధ్యన గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఎస్. థమన్ జరగండి పాటకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ట్రెండీగా, గ్రాండ్‌గా కనిపిస్తోంది. అయితే గేమ్ ఛేంజర్ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే శంకర్ జరగండి పాటకు కోసం భారీ గానే ఖర్చు పెట్టారట. ఏకంగా రూ.20 కోట్లతో జరగండి పాటను తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఇది నిజమయితే ఇండియాలోనే అత్యంత ఖరీదైన పాటగా రామ్ చరణ్ సాంగ్ నిలవనుంది. ఎందుకంటే రూ. 20 కోట్లతో ఒక రెండు, మూడు చిన్న సినిమాలు తెరకెక్కించవచ్చు. అలాంటిది ఒక సాంగ్ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే ఎలా తెరకెక్కించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇటీవల షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో జిందా బందా సాంగ్ కోసం రూ. 15 కోట్లు ఖర్చుపెట్టారట మేకర్స్. ఆ లెక్కన చూసుకుంటే బాలీవుడ్ బాద్ షా రికార్డును రామ్ చరణ్ బ్రేక్ చేసినట్లే. కాగా శంకర్ సినిమాల పాటలు ఎంత రిచ్‌గా, ట్రెండీగా ఉంటాయో గతంలో చూశాం. ముఖ్యంగా జీన్స్ సినిమాలో ప్రపంచంలోని ఏడు వింతలను ఒకే సాంగ్‌లో చూపించి సంచలనం సృష్టించారు. ఇక శంకర్ డైరెక్షన్లోనే వచ్చిన రోబో సినిమాలో ఒక పాటను కూడా సుమారు రూ. 20 కోట్లతో చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడిదే తరహాలో గేమ్ ఛేంజర్ సాంగ్‌ను రూ. 20 కోట్లతో రూపొందించారని తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, ఎస్. జే. సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –