Movies

నా పేరు పెట్టుకొనే సాహసం ఉందా? సూర్యాకాంతం శతజయంతి ప్రత్యేకం

నా పేరు పెట్టుకొనే సాహసం ఉందా? సూర్యాకాంతం శతజయంతి ప్రత్యేకం

చిత్రసీమంటే ఎన్నో చిత్రాల దొంతరలు!
చలన చిత్ర జగత్తులో వైవిద్య చిత్రాలు!
సినీ వినీలాకాశంలో వైరుద్య పాత్రలు!
తెరపై ఎందరో వస్తుంటారు! పోతుంటారు!
కానీ మదిలో ముద్రితమై పోయేవారు కొందరే సుమా!

ఆప్యాయతలు పంచే అమ్మైనా! గడుసరి పెండ్లామైనా! అసూయపడే తోడుకోడలైనా! ఓర్వలేని ఆడబిడ్డైనా! గయ్యాళి అత్తైనా! ఆమెకు ఆమే సాటి! ఆమెలాంటి నటులు వెనుక లేరు! నేడు కానరారు! ముందు రాబోరు! నటించడం ఆమెకు రాదు! ఏపాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ప్రవర్తించడమే ఆమెకు తెలుసు!

మొదట అన్నిరకాల పాత్రలలోనూ నటించిన సూర్యకాంతం చివరికి ‘గయ్యాళి” పాత్రలకు పేరుపడిపోయారు. సరళ స్వభావం, మంచితనం ఉన్న పాత్రలను సూర్యకాంతం చెయ్యలేరనీ కాదు, చెయ్యలేదనీ కాదు. ‘మాయాబజార్’ చిత్రంలో ఘటోత్కజుని తల్లి ‘హిడింబి’గా మంచితనాన్ని ప్రదర్శిస్తూ ‘సుపుత్రా నీకిది తగదంటిని కదరా!’ అని కొడుక్కి నచ్చజెప్పుకునే తల్లిగా మరుపురాని నటన ప్రదర్శించారు. అలాగే ‘భార్యాభర్తలు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘లవకుశ’, ‘ఇద్దరు మిత్రులు’ ఇలా ఎన్నో…..చిత్రాలలో హాస్య పాత్రలనూ, అమాయకపు పాత్రలనూ పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ పాత్రలను రక్తి కట్టించారు. కానీ ఈర్ష్యనూ, అసూయనూ, గయ్యాళితనాన్నీ సూర్యకాంతం నటించేస్థాయిలో మరెవరూ నటించలేక పోవటంతో, ఆమె ‘గయ్యాళి’ అత్తగారుగానే ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని పొందారు. ‘తోడికోడళ్ళు’, ‘వెలుగునీడలు’, ‘రక్తసంబంధం’ మొదలైన సినిమాలు ఆమెను ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిని చేశాయి. సాధారణంగా చలన చిత్రాలకు కధానాయకుల పేర్లుండటం రివాజు. అలాంటి సమయంలో, ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల్లాంటి మేటినటుల కలసి నటించిన సూర్యకాంతం తన పాత్ర పేరుతో “గుండమ్మ కథ” చిత్రం అఖండ విజయం సాధించింది.

అరవయ్య దశాబ్దంలో అనేక సినిమాలకు నిజమైన హీరో సూర్యకాంతం. ఆమె ఉంటేనే ఆ చిత్రాలు విజయం సాధిస్తాయి! అనిపించేంత ప్రధాన పాత్రలల్లో నటించి మెప్పించారు. సూర్యకాంతం లేకపోతే నాటి తెలుగు సినివినీలాకాశం సూర్యకాంతి లేక వెలవెలబోయే ఉండేదనటంలో సందేహం లేదు.

మన నిత్యజీవితంలో తటస్థపడే కొందరు వ్యక్తులను సూర్యకాంతంతో పోల్చిచూసుకోవటం తెలుగువారికి అలవాటయింది. ఒక మనిషిని గయ్యాళనిగానీ, అసూయపరురాలని గానీ చెప్పాల్సివస్తే ఆ విశేషణాలేవీ వాడకుండా “సూర్యకాంతం అనుకో” అని చెప్పటం మామూలయిపోయింది. ఇంతగా పాత్రల స్వభావాన్ని తమ వ్యక్తిత్వాలకు ఆపాదించుకున్న నటులు అరుదనే చెప్పాలి. ఎంత దుర్మార్గమైన పాత్రలు వేసినా తెలుగునాట సూర్యకాంతం అంటే ఎంతో ఇష్టం. ఒక దశలో ఆమె లేని చిత్రం ఉండేదికాదు.

సూర్యకాంతం పేరు వింటూనే తెలుగింటి కోడళ్ళకు గుండెల్లో గుబులు!
తరాలుమారినా తమబిడ్డలకు ఆమెపేరు పెట్టుకొనడానికికూడా తల్లిదండ్రులు సాహసించరు!
ఆమె హావభావాలు కూడా ఎవ్వరూ అనుకరించడానికి ధైర్యం చెయ్యరు!
గయ్యాలి అత్తగా తెలుగువారి మదిన చెరగని ముద్ర వేసి పోయింది!


తెరవెనుక నేపథ్యం……
సూర్యకాంతం కాకినాడలోని వెంకటకృష్ణరాయపురంలో
వెంకటరత్నమ్మ, అనంతరామయ్య దంపతులకు
పద్నాల్గవ సంతానంగా జన్మించింది!
ఆరేళ్ళ ప్రాయంలో ఆటపాటలు నేర్చింది!
చిత్రసీమలో నటించాలనే ఆశ మొగ్గ తొడిగింది!
అది నెరవేరడానికి చెన్నపురిలో అడుగిడింది!
మొదటి చిత్రం’నారద నారది’లో నటించింది!
చంద్రలేఖ చిత్రంలో నృత్యం చేసింది!
ధర్మాంగనలో మూగపాత్రలో జీవించింది!
గృహ ప్రవేశంవో అడుగు పెట్టింది!
ఇలా చిన్న చిన్న వేశాలు వేసే తనకు
కథానాయకిగా నటించే అవకాశం తలుపు తట్టింది!
కారు ప్రమాదం ఆ అదృష్టాన్ని తొక్కిపెట్టింది!
ఇరవైవ ఏట సంసారం చిత్రంలో అరవైఏండ్ల అత్తపాత్రవేసింది!
కత్తులు కటారులు చేతిలో లేకుండానే
కుడిచేయి నడుంపై పెట్టి, ఎడమ చేయి తిప్పుతూ
నోటిమాటనే తూటాలులాగ పేల్చి మనస్సులు గాయపరిచేలా
తన సంభాషణా చాతుర్యంతో చూసేవారికి కూడా కన్నీళ్ళు పెట్టించేది!
అంతలోనే తాను బొల్లి ఏడుపులు ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టేది!…..

సంభాషణలు పలకటంలో ఆమెది ప్రత్యేకమైన తీరు, గొంతులో ఓర్వలేని తనాన్నీ, కసినీ, లేని దుఃఖాన్నీ పలికించటంలో అసాధారణ ప్రతిభ చూపించేది. ఎడమచేతిని తిప్పుతూ ఆమె చేసే అభినయం ఎక్కడా మితిమీరకుండా ప్రేక్షకుల మెప్పు పొందేది. ఆమె నటన చూస్తుంటే మానవ స్వభావంలోని కొన్ని లోతులను ఆమె అంతగా ఎట్లా ఆకళింపు చేసుకున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది.

నేటి కోడళ్ళే రేపటి అత్తలు! తాను కోడలుగా ఉన్నప్పుడు పడ్డ బాధలే చిత్రాలలో అత్త పాత్రలు చేయడానికి ప్రేరణ అయ్యిందంటారు కొందరు ఆమె సన్నిహితులు.

పైన ఒకరూపం లోపల మరోరూపంతో మేకవన్నె పులిలా నటించడం ఆమెకు చేతకాదు. పులిలానే రాణించింది. ఆమెను అనుకరించే సాహసం ఎవరూ చేయలేదు!

ఆమె సినిమాలలో ఎంత గయ్యాలో నిజ జీవితంలో అంత సరళ స్వభావురాలు. అత్తపాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆమె నిజజీవితంలో అందరూ ‘అమ్మ’ అని పిలిచేంత ఆత్మీయంగా మెలిగేవారు. చిత్రాలలో అందర్నీ కాల్చుకు తినే సూర్యకాంతం నిజ జీవితంలో తను చేసిన వంటలను చుట్టూవున్న వారికి తినిపించటంలో ఆనందం పొందేవారు.

అత్తగారి పాత్రకు జీవంపోసి రాణించింది. ఇలా తెరపై అత్తగా దర్పాన్ని చూపుతూనే తెరవెనుక అమ్మగా కమ్మగా ఆదరించి అన్నం పెట్టి మెప్పించిన నటీమణి పెద్దిబొట్ల సూర్యకాంతం (28-10-2023) నేటికి పుట్టి వంద సంవత్సరాలు పూర్తవుతుంది.

సూర్యకాంతం శతజయంతి సందర్భంగా ఆమెకు శతకోటివందనాలు!

• డా. సగిలి సుధారాణి
• 9490428825