DailyDose

 వ్యభిచారం క్రిమినల్‌ నేరమే-నేర వార్తలు

 వ్యభిచారం క్రిమినల్‌ నేరమే-నేర వార్తలు

*   వ్యభిచారం క్రిమినల్‌ నేరమే

వ్యభిచారాన్ని క్రిమినల్‌ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ బిల్లులను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. తదుపరి సమావేశం నవంబరు 6న జరుగుతుంది. వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు 2018లో తీర్పు చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, వ్యభిచారాన్ని క్రిమినల్‌ నేరంగా పునరుద్ధరించాలని ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉన్నది.

 వదిన పై మరిది అఘాయిత్యం

 రోజు రోజుకి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మంచి చెడులకు మధ్య వ్యత్యాసాన్ని విస్మరించి మృగంలా మారుతున్నాడు. శారీరక వాంఛలతో దారుణాలకు ఒడిగడుతున్నాడు. క్షణకాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. వావివరసలు మర్చిపోతున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వదిన అంటే అమ్మ తరువాత అమ్మలాంటిది అంటారు. అందుకే అన్న భార్యను వదినమ్మ అని పిలుస్తారు. అయితే అలాంటి వదిన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ మూర్ఖుడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళ్తే.. S.P.S.R నెల్లూరు జిల్లా లోని పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంకిత జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. తల్లి లాంటి వదిన పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో బాధితురాలు గ్రామ సచివాలయం లోని మహిళా పోలీసును ఆశ్రయించింది. జరిగిన దారుణాన్ని మహిళా పోలీసుకి విన్నవించుకుని దారుణానికి పాల్పడ్డ మరిది పైన ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా పోలీసుతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను ఈ దారుణానికి పాలపడ్డట్లు తెలిపింది. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన గురించి విచారణ చేస్తున్నారు.

ఉక్కు గనిలో భారీ అగ్నిప్రమాదం 

ఉక్కు గనిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని అందులో పనిచేస్తున్న 30 మంది కార్మీకులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కజకిస్తాన్‌లోని లక్సెంబర్గ్‌ స్టీల్‌మేకర్ కంపేనిలో జరిగింది. ఈ ప్రమాదం గురించి ఆ కంపెనీ యూనిట్ ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ స్వయంగా మీడియాతో తెలిపారు. ఆయన ప్రకారం.. ప్రమాద సమయంలో కోస్టెంకో గనిలో 252 మంది కార్మికులు పనిలో ఉన్నారు. కార్మికులు తమ పని చేసుకుంటుండగా.. మీథేన్ పడిపోయింది.దీంతో అందులోంచి 206 కార్మికులు బయటకు వచ్చారు. అలాగే 18 మంది గాయపడ్డారు. 30 మంది కార్మికులు మృతి చెందారని.. ఆర్సెలర్‌మిట్టల్ టెమిర్టౌ తెలిపారు. దీనిపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకాయే వ్, ఆర్సెలార్ మిట్టల్ టెమిర్టౌతో పెట్టుబడి సహకారాన్ని నిలిపివేయాలని తన మంత్రివర్గాన్ని ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపి, అక్టోబర్ 29న జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

హైదరాబాద్ లో యువతి దారుణ హత్య

ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ హత్య మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్తే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో స్వప్న(24) అనే యువతి, హనుమంతు(25) అనే యువకుడు కలిసి ఉంటున్నారు. కాగా వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూడా యువతి యువకుడిని పలు మార్లు హెచ్చరించాడు. అయిన గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం రావడంతో ఇంటి యజమాని బయటకు వచ్చి చూసాడు. హనుమంతు రెండొవ అంతస్తు నుండి కింద పడి ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్వప్న, హనుమంతు నివసిస్తున్న ఇంటి నుండి కంగారుగా బయటకు వచ్చి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.దీనితో భయాందోళనకు గురైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకి సమాచారం అందించాడు. అనంతరం స్వప్న నివాసం ఉంటున్న ఇంటి లోనికి వెళ్లి చూడగా యువతి రక్తం మడుగులో మృతి చెంది ఉంది. కాగా పైన నుండి పడిన హనుమంతుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ క్రమంలో చికిత్స కోసం హనుమంతుని ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజ్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. యువతి హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలానే హనుమంతు బిల్డింగ్ నుంచి ఆత్మహత్యకు యత్నించడా.. లేక గుర్తు తెలియని వ్యక్తులు నెట్టి వేశారా అనే అనుమానాలు కలుగుతుండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు.

మహిళపై గన్స్‌తో కాల్పులు

ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు.  కాల్పుల శబ్దం విన్న పొరుగువారు ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్‌ వదిలి పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జైత్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి ముసుగులు ధరించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆ ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు.కాగా, కాల్పుల శబ్దం విన్న పొరుగువారు వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. బైక్‌పై పారిపోతున్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారు బైక్‌ను వదిలి పరుగులు తీసి తప్పించుకున్నారు. కాల్పుల్లో గాయపడిన పూజా యాదవ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులకు చెందిన నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకున్నారు. పూజాను వారు ఎందుకు కాల్చి చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి

బోనకల్ మండలం గోవిందాపురం ఎల్ గ్రామంలో సీపీఎం, కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగిన గొడవలో సీపీఎం కు చెందిన ఎర్రబోయిన నాగేశ్వరావు గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో శనివారం ఉదయం మరణించారు. నాగేశ్వరావు అంత్యక్రియలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. నాగేశ్వరావు మృతి నేపథ్యంలో గ్రామంలో పోలీస్ లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

* ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య

 ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. (family mass suicide ) మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇంటిలో సూసైడ్‌ నోట్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం అడాజన్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు గమనించారు. డోర్‌ తట్టి, బెల్‌ మోగించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.కాగా, అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి డోర్‌ను పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అందులో నివసిస్తున్న కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రహించారు. మృతులను 35 ఏళ్ల మనీష్ సోలంకి, 32 ఏళ్ల భార్య రీటా, పిల్లలు ఏడేళ్ల దిశ, ఐదేళ్ల కావ్య, మూడేళ్ల ఖుషాల్‌, మనీష్‌ తల్లిదండ్రులైన 65 ఏళ్ల కాంతిలాల్‌ సోలంకి, 60 ఏళ్ల శోభనగా గుర్తించారు. కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు విషం తాగి చనిపోగా మనీష్‌ ఉరి వేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసి ఉన్న నోట్‌, విషం బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు ఫర్నీచర్‌ వ్యాపారంతోపాటు కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న మనీష్ సోలంకి ఆ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కుటుంబంతో కలిసి ఉంటున్న అతడు చాలా మందికి డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు చెప్పారు. దీపావళి పండుగ సమీపిస్తున్నందున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడని, వారు ఇవ్వకపోవడంతో తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. అయితే ఆ ఫ్యామిలీ సామూహిక సూసైడ్‌కు కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కారాగారం నుండి కోర్టుకు తరలిస్తుండగా ఖైదీ పరార్

 చేసిన నేరాన్ని ఒప్పుకుని కోర్టులో లొంగిపోయేవాళ్లు కొందరు. నేరంచేసి పట్టుబడకుండా పరారీలో ఉండే వాళ్ళు కొందరు. అయితే నేరం చేసి పోలీసులకుపట్టుబడి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా.. శిక్ష నుండి ఎలా తప్పించుకు పారిపోవాలా అని చూసే వాళ్ళు కొందరు. నేరం చేయడం తప్పు.. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకుపోతే శిక్ష ఎక్కువ పడివుతుంది. అని తెలిసి కూడా కొందరు ఖైదీలు జైలు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. జైలు నుండి ఖైదీలు పారిపోయిన ఘటనలు గతంలో కూడా చూసి ఉంటాం. అలాంటి ఘటనే తాజాగా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళ్తే.. చోడవరం మండలం లోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజు(31) అనే వ్యక్తి విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నాడు. కాగా నిందితుడిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఎలమంచిలి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో నిందితుడు తప్పించుకుని పరారైయ్యాడు. ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసులకి టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు నూకరాజు. ఎంత సేపటికి రాకపోయే సరికి అనుమానం వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు వెళ్లి చూడగా నిందితుడు కనిపించలేదు. దీనితో పిల్లా నూకరాజు కోసం ఎస్కార్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎంత వెతికిన నిందితుడు దొరకలేదు. దీనితో ఎస్కార్ట్ పోలీసులు ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z