ఉల్లి ధరలు అదుపు చేయడానికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరను (MEP) టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది. దేశీయంగా ఉల్లి (Onion) అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపునకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 29 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. ఉల్లి నాట్లు ఆలస్యంగా పడడం, దిగుబడి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర రూ.65-80 వరకు పలుకుతోంది. ఇ-కామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లలో రూ.67 చొప్పున విక్రయిస్తుండగా.. చిన్న చిన్న విక్రేతలు కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఉల్లి కిలో రూ.60పైనే పలుకుతోంది. ధరల కట్టడికి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ను విడుదల చేసింది.
👉 – Please join our whatsapp channel here –