Agriculture

అమరావతి రైతులకు సీఆర్డీఏ నోటీసులు

అమరావతి  రైతులకు సీఆర్డీఏ నోటీసులు

రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ల్యాండ్‌పూలింగ్‌ విధానంలో తీసుకున్న భూముల్లో కేటాయించిన ప్లాట్లను రాజధాని రైతులు రద్దుచేసుకోవాలంటూ సీఆర్డీఏ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని వాటిలో పేర్కొంది. శనివారం పలువురు రైతులకు నోటీసులు అందాయి. అయితే ఇందులో అమరావతిని నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉందంటూ అమరావతి ఐకాస నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న ప్రణాళికతో ఉన్న నాటి ప్రభుత్వం.. ఆ కలను సాకారం చేసేందుకు ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకొంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని లేఖలు పంపిస్తోంది. కేటాయించిన ప్లాట్లను రద్దుచేసుకుంటే భూములివ్వని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అమరావతి నిర్మాణం విచ్ఛిన్నమవుతుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తొందరపడి సంతకాలు చేయొద్దు

అమరావతి సమన్వయ కమిటీ సభ్యులు……సీఆర్డీఏ నుంచి వచ్చిన లేఖలను తీసుకున్నా, తొందరపడి వాటిపై సంతకాలు చేయొద్దని రాజధాని రైతులకు అమరావతి సమన్వయ కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ప్లాట్లు రద్దుచేసుకుంటే వేరేచోట ఇస్తామని చెప్పడంపై అనుమానాలున్నాయని చెబుతున్నారు. భూ సమీకరణకు విముఖత చూపిన రైతులకువారి భూములను తిరిగి ఇచ్చేస్తే అమరావతి ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులందరితో సమావేశం నిర్వహించి, న్యాయవాదుల సలహాలు, సూచనల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని ఐకాస నాయకులు ప్రకటించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z