రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబుకు దృష్టి సమస్య ఉందని, ఆయన కుడికంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణుడు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ బి.శ్రీనివాసరావు ఈ నెల 25న చంద్రబాబుని పరీక్షించి, జైలు అధికారులకు నివేదిక ఇచ్చారు. అందులో చంద్రబాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయాలని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వైద్యులూ ఇటీవల ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. వారే చంద్రబాబుకు 2016లో ‘యాంగిల్ క్లోజర్ గ్లకోమా’ అనే కంటి సమస్యకు లేజర్ చికిత్స, ఈ ఏడాది జూన్ 21న ఎడమ కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున మూడు నెలల్లోగా కుడికంటికీ శస్త్రచికిత్స చేయాలని అప్పుడే తెలిపారు. ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ వారు అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు.
👉 – Please join our whatsapp channel here –