Politics

నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్

నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలూ స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు, ప్రచారాలతో ప్రజలకు చేరువై.. ఓట్లను అభ్యర్థించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే.. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే.. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కాస్త ముందు వరసలో ఉంది. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించిన బీఆర్ఎస్‌.. ప్రచారంలోనూ టాప్‌ గేర్‌లో వెళ్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి గురించి ప్రస్తావించడంతోపాటు.. విపక్షాల విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక.. దసరా తర్వాత రెండో విడత ప్రచారం షురూ చేశారు గులాబీబాస్‌ కేసీఆర్‌. దానిలో భాగంగా.. రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఒక రోజు గ్యాప్‌ తర్వాత.. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 9వరకు నాన్‌స్టాప్‌ ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మురేపనున్నారు. ఒక్కో రోజు రెండు, మూడు ప్రచార సభలతో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. రెండో విడత ప్రచారంలో చివరిరోజు నవంబర్ 9న గజ్వేల్‌, కామారెడ్డి నుంచి కేసీఆర్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆ రెండు నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు.

సీఎం కేసీఆర్ తోపాటు.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుసగా సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ఎప్పటిప్పుడు క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌ పక్కా వ్యూహాలతో ముందుకువెళ్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z