NRI-NRT

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల దుస్థితి

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల దుస్థితి

గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ఉన్న‌త విద్యావ‌కాశాలు.. అటుపై ఉద్యోగంలో స్థిర‌ప‌డ‌టానికి భార‌తీయ విద్యార్థులు గ‌ణ‌నీయ సంఖ్య‌లోనే త‌ర‌లి వెళుతున్నారు. ఇంత‌కుముందు ఎక్కువ మంది అమెరికాకు వెళ్లేవారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ హ‌యాంలో అమెరికా స‌ర్కార్ తెచ్చిన ఆంక్ష‌ల‌తో కెన‌డా, బ్రిట‌న్‌, యూర‌ప్ దేశాల‌కు వెళుతున్నారు. అలా బ్రిట‌న్‌కు వెళుతున్న విద్యార్థులు ఏటేటా పెరుగుతున్నారు. 2022లో బ్రిట‌న్‌కు 55,465 మంది విద్యార్థి వీసాపై వెళ్లార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గ‌త జూన్ నాటికి 1,42,848 మంది భార‌తీయ విద్యార్థులు.. విద్యార్థి వీసాపై వ‌చ్చార‌ని బ్రిట‌న్ హోంశాఖ వెల్ల‌డించింది.

అనునిత్యం వ‌స్తున్న విదేశీ విద్యార్థుల‌కు బ్రిట‌న్‌లో వ‌స‌తి ల‌భించ‌డం క‌నాక‌ష్టంగా మారుతోంది. విదేశీ విద్యార్థులు పెరిగిపోవ‌డంతో ఇంటి ఓన‌ర్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఇంటద్దెలు పెంచేశారు. లండ‌న్ యూనివ‌ర్సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థిని శ్ర‌ద్ధా చ‌క్ర‌వ‌ర్తి.. అద్దె ఇంటికి వారానికి 299 పౌండ్లు చెల్లించాన‌ని వాపోయింది. ఇదిలా ఉంటే విద్యార్థుల‌తోపాటు వివిధ ర‌కాల వీసా ఫీజును బ్రిట‌న్ స‌ర్కార్ ఇటీవ‌ల భారీగా పెంచివేసింది.

ఇంట‌ద్దె పెరిగిపోవ‌డంతో స‌రిప‌డా స్పేస్ లేకున్నా.. ఇరుకు ఇండ్ల‌లో స‌ర్దుకోవ‌డానికైనా భార‌త్ విద్యార్థులు సిద్ధం అవుతున్నారు. అటువంటి ఇండ్ల‌లో అద్దెకు దిగే విష‌యంలోనూ చురుగ్గా ఉండాల్సిందేన‌ని చెబుతున్నారు. 2020 అక్టోబ‌ర్‌లో ఎంఎస్సీ కోర్సులో చేరిన అరుణ్ ప్యాట్రిక్ అనే విద్యార్థి.. తాను ఉన్న ఇంట్లో ఐదుగురికి మాత్ర‌మే స‌రిపోతుంద‌ని, కానీ.. ఇండ్ల కొర‌త‌తో ఎనిమిది మంది విద్యార్థులం స‌ర్దుకుపోతున్నామ‌న్నారు. అంతే కాదు.. విదేశీయుల‌కు అద్దె ఇల్లు కావాలంటే, బ్రిట‌న్ వాసులు గ్యారంటీ ఇవ్వాలి.. అలా గ్యారంటీ పొందాలంటే… బ్రిట‌న్ పౌరుల‌కు విద్యార్థులైనా స‌రే విదేశీయులు కొంత ఫీజు స‌మ‌ర్పించుకోవాల్సిందే. అలా చేయాలంటే పార్ట్‌టైం జాబ్ చేస్తేనే ఖ‌ర్చులకు తేలిగ్గా ఉంటుందంటున్నారు భార‌తీయ విద్యార్థులు.

అద్దె ఇల్లుతోపాటు పార్ట్‌టైం ఉద్యోగం కూడా వెతుక్కుంటేనే వెసులుబాటుగా ఉంటుంది. కేవ‌లం అద్దె ఇల్లుకే ప్రాధాన్యం ఇచ్చినా.. పార్ట్ టైం ఉద్యోగం కోసం ట్రై చేసినా ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు. క‌నుక పూర్తికాలం ప‌ని చేసేందుకు సిద్ధం కావాల‌ని అరుణ్ అనే హెల్త్‌కేర్ అసిస్టెంట్ చెప్పారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత మూడేండ్ల‌కు కూడా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌లేద‌ని తేల్చేశాడు. అద్దె ఇండ్ల‌లో చేరిన‌ప్పుడు.. అంత‌కుముందు ఉన్న వారితో స‌ర్దుకుపోవాల్సి ఉంటుంది. అది తిండికి కూడా వ‌ర్తిస్తుంది. అంద‌రితో స‌మానంగా మాత్ర‌మే తినాలి. వేర్వేరు స‌మ‌యాల్లో తినే అల‌వాటు ఉన్న‌వారు ఉంటారు. చివ‌రికి తినే వారికి ఏమీ మిగ‌ల‌క‌పోవ‌చ్చు అని కూడా చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z