అమెరికా గడ్డపై తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డల్లాస్ (టీ-పాడ్) తెలంగాణ సంస్కృతిని వికసింపజేస్తున్నది. డల్లాస్ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న టీపాడ్ ఈ ఏడాది మరింత ఉత్సాహంతో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించింది. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించగా.. ఈ వేడుకలకు తెలంగాణ ఆడపడుచులు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డల్లాస్‌లోని ఫ్రిస్కో పట్టణంలోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా)లో సందడి చేశారు. మహిళలందరూ బృందాలుగా పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలి వచ్చిందన్న అందంగా ఈ వేడుక సాగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 12వేల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు టీ-పాడ్ బృందం తెలిపింది. ఫౌండేషన కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో సద్దుల బతుకమ్మకు దసరా పండగ తోడవడంతో డల్లాస్ అంతా ఉత్సాహంగా, కలర్‌ఫుల్‌గా కనిపించింది.
సందడి చేసిన సంయుక్త మీనన్…..ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఔత్సాహికుల భాగస్వామ్యంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. చెప్పిన టైం కంటే ముందే వచ్చిన టాలీవుడ్ స్టార్ నటి సంయుక్త మీనన్ ప్రతి బృందంతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయింది. ఈ వేడుకకు వచ్చింది తొలిసారే అయినా.. సంయుక్త అందరితో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడడం తెలుగు మహిళలందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. ఇక బతుకమ్మ వేడుకల అనంతరం అదే వేదికపై దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజ నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్ బలయ్ తీసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here for all TPAD updates –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z