NRI-NRT

అమెరికాలో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

అమెరికాలో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఈనెల 18న హఠాన్మరణం చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన గడ్డం బాలేశం, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి బోయినపల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద హనుమాజీ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు గడ్డం వినీత్ (23) ఉన్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్ కాగా, తల్లి ఓ దుకాణంలో రోజువారీ కూలీ. అయితే వినీత్ హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని మాస్టర్స్ డిగ్రీ కోసం ఆగస్టు 27న అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూజెర్సీలోని ఓ కాలేజీలో చేరాడు. సెప్టెంబర్ 1న పుట్టినరోజు వేడుకలు కూడా అమెరికాలోనే చేసుకున్నాడు. స్నేహితుడైన తమిళనాడుకు చెందిన పళని వద్ద ఉంటూ అతని రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు వినీత్ తన తండ్రికి తెలిపాడు.

అయితే, కొద్దిరోజులకే కాలేజీ నచ్చకపోవడంతో న్యూయార్క్ వెళ్లి సెయింట్ ప్రాన్సిస్ ట్రోక్‌లైన్ కాలేజీలో చేరాడు. ఈ క్రమంలో రోజూ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈనెల 18న భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటల సమయంలో చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి వినీత్ ఫోన్ పనిచేయడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసినా స్వీచాఫ్ అని వస్తుండడంతో ఈనెల 19న విషయం పళనికి తెలిపారు. దీంతో అతను న్యూయార్క్ వెళ్లి కాలేజీలో ఆరా తీసిన వినీత్ జాడ దొరకలేదు. కంగారు చెందిన పళని 20న న్యూయార్క్‌లో వినీత్ మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేసిన అధికారులకు హార్ట్ అటాక్ (కార్డియాస్ట్రోక్) తో మృతి చెందిన ఓ భారతీయుని మృతదేహం మార్చురీలో ఉందని తెలపడంతో వెల్లి చూసిన పళని అతను వినీత్ అని గుర్తించాడు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 18న ఉదయం 7 గంటల సమయంలో వినీత్ నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటుతో మృతిచెంది రోడ్డుపైన పడివున్నాడని అక్కడి పోలీసులు వెల్లడించారు.

ఆ విషయాన్ని పళని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో బోయినపల్లిలోని వినీత్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలే అప్పులు చేసి ఉన్నత చదువుకోసం వనీత్‌ను అమెరికాకు పంపించిన తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్రమత్రి కిషన్‌రెడ్డికి, ఇద్దరు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. నాటి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు అమెరికాలోని తమిళనాడు అసోసియేసన్, తెలుగు అసోసియేషన్ వారు సహకారం అందించారు. అక్కడి నిబంధనలను పూర్తిచేసిన పళని శుక్రవారం అర్ధరాత్రి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో మృతదేహంతో బయలుదేరాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని కుటుంబ సభ్యులు ఆంధ్రజ్యోతి ప్రతినిధికి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z