Devotional

తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన ఆలయాలు

కుమార పౌర్ణమి (పర్వదినం) పురస్కరించుకుని శనివారం రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం తిరిగి ఆదివారం ఉదయం ఆలయాలు తెరుచుకోనున్నాయి.

తిరుమలలో..
తిరుమల శ్రీవారి ఆలయాన్ని శనివారం రాత్రి 7.05 గంటలకు తితిదే అధికారులు మూసివేశారు. 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను తితిదే రద్దు చేసింది. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని కూడా తితిదే మూసివేసింది. ప్రత్యామ్నాయంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు.

పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో విజయవాడ దుర్గగుడిలో ఆదివారం ఉదయం 9గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఆదివారం ఉదయం 7గంటల వరకు శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేత.
ఆదివారం ఉదయం 8గంటల వరకు సింహాచలం ఆలయం మూసివేత.

ఒంటిమిట్ట, దేవునికడప, గండి ఆంజనేయస్వామి ఆలయాలను ఆదివారం ఉదయం వరకు మూసివేయనున్నారు.
మేష, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం చూడరాదని పండితులు చెబుతున్నారు.

కృష్ణాజిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారికి దీపారాధన అనంతరం ఆలయ తలుపులు మూసి వేశారు. సంప్రోక్షణ అనంతరం ఆదివారం ఉదయం 8గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z