Politics

తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటం

తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటం

వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని.. సాగునీటి రంగం, మిషన్‌ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టించడం కోసం రుణాలు తీసుకువచ్చినట్లు తెలిపారు.

మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే..
దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే.. ఒక్క హైదరాబాద్‌ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని.. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ప్రతీ జిల్లాకో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. గతంలో మైగ్రేషన్‌కు పర్యాయపదంగా పాలమూరు ఉంటే.. ఇప్పుడు ఇరిగేషన్‌కు పర్యాయపదంగా మార్చామన్నారు. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని.. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేసినట్లు వివరించారు.

కర్ణాటకకు వెళ్లి ఆరా తీద్దాం.. సిద్ధమా?
‘‘ఏపీలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలింది. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ ఆరాటం. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారు. కేంద్రంలో భాజపాకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. వారికి ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది? 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు.. ఏమైంది? కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారు. కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా?’’ అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z