Business

అంబానీకి బెదిరింపు మెయిల్‌

అంబానీకి బెదిరింపు మెయిల్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీన్‌ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి శుక్రవారం (అక్టోబరు 27) గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్‌ (Threat Email) వచ్చింది. ‘‘మా దగ్గర మంచి షూటర్లున్నారు. రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’’ అని ఆ మెయిల్‌లో ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ముంబయి గామ్‌దేవీ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z