ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్‌వెబ్‌లో వెలువడిన ఒక ప్రకటన ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిని దేశంలోనేఅత్యంత భారీ డాటా చోరీగా పేర్కొంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగల చేతికి చిక్కినట్టు తెలుస్తున్నది.
ఈ ఘటనపై ఐసీఎంఆర్ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం ఉన్నట్టు ఓ అజ్ఞాత వ్యక్తి డార్క్‌వెబ్‌లో ప్రకటించాడు. దీనికి సంబంధించి కొన్ని పేర్లు, వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లతో సహా వెల్లడించాడు. ఈ వివరాలు ఐసీఎంఆర్ వద్దనున్న డాటాతో సరిపోలినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ మీద గత ఫిబ్రవరి నుంచే సైబర్ దాడులు జరుగుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. దీనిపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర సంస్థలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, అక్కడి నుంచే డాటా చోరీ జరిగిందని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డాటా చోరీలో విదేశీ వ్యక్తుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మరింత నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు.
కొవిడ్ పరీక్షలతో ఐసీఎంఆర్‌కు చేరిన డాటా
కొవిడ్ పరీక్షలు జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా వైద్య సంస్థలు సేకరించిన పౌరుల వివరాలు ఐసీఎంఆర్‌కు, జాతీయ సమాచార కేంద్రానికి (ఎన్‌ఐసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ మూడు ప్రదేశాలలో ఎక్కడి నుంచి డాటా చోరీ అయిందో తెలియాల్సి ఉన్నదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారతీయుల డాటా చోరీ విషయాన్ని ముందుగా అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, నిఘా
విభాగమైన ‘రీసెక్యూరిటీ’ సంస్థ బయటపెట్టింది. ఈ నెల 9న ‘పీడబ్ల్యూన్0001’ పేరిట ఓ అజ్ఞాత వ్యక్తి 81.5 కోట్ల మంది భారత పౌరుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డులను ‘బ్రీచ్ ఫోరమ్స్’పై పోస్ట్ చేసినట్టు రీసెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
తమ వద్దనున్న డాటాకు రుజువుగా నాలుగు శాంపిల్స్‌ను కూడా సదరు అజ్ఞాత వ్యక్తి బయటపెట్టగా.. ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన ‘గుర్తించదగిన వ్యక్తిగత సమాచారం (పీఐఐ)’ ఉన్నట్టు చెప్తున్నారు. భారత ఆరోగ్య వ్యవస్థపై హ్యాకర్లు దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఢిల్లీలోని ఎయిమ్స్‌పై సైబర్ దాడులు జరిగాయి. సర్వర్లన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులన్నీ ప్రభావితం చేశారు.
ఏం జరుగొచ్చు?
ఆధార్ వివరాలు అంత సురక్షితంగా లేవని, ఆ సమాచారాన్ని ఎవరైనా దొంగిలించవచ్చని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గత నెలలోనే హెచ్చరించాయి. అయితే హెచ్చరికలను కేంద్ర సంస్థలు వెంటనే తోసిపుచ్చాయి.దేశంలో బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తిఆధార్‌ను దానికి అనుసంధానం చేశారు. పట్టణాలు, నగరాల్లోనే కాదు గ్రామీణులు సైతం ఎలక్ట్రానిక్స్ విధానంలో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇప్పటికి 94.5 కోట్ల మంది అనగా 60 శాతం మంది ఓటర్లు తమ ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేశారు. సైబర్ దొంగల వద్దనున్న భారతీయుల డాటాతో ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.