కక్ష సాధింపునకు మానవ రూపం సీఎం జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే.. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదని ఎద్దేవా చేశారు. జగన్ తెచ్చిన పిచ్చి మందుకు 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారన్నారు. మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని దుయ్యబట్టారు.
మద్యపాన నిషేధం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్.. చంద్రబాబుపై కేసు పెట్టడం వింతగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చన్నారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో తేల్చుకునేందుకు రాష్ట్రంలో జగన్ పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జగన్‌కు మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే సమయం చెప్పాలన్నారు.
గత తెదేపా హయాంలో మద్యం అక్రమాలు జరిగితే నాలుగున్నరేళ్ల పాటు ఎందుకు జగన్ మౌనంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చే ముందు రోజే ఇది కనబడిందా అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో రూ.లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబుపై మద్యం పేరుతో మరో అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో, అరాచకంతో వ్యహరిస్తున్న జగన్ రెడ్డి రానున్న కాలంలో శిక్షకు గురికాక తప్పదని అచ్చెన్న హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –