కార్గో(పార్సిల్) సేవల్లో బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, సికింద్రాబాద్(జేబీఎస్) బస్టాండ్లలో ఉన్న కార్గో బుకింగ్ కేంద్రాల్లో తొలుత అమలు చేయనున్నారు. ఇందుకు బుకింగ్ కేంద్రాల్లోని కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్సిళ్లు బుక్ చేసినచోట, చేరినచోట ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. తప్పుడు వివరాలు నమోదైతే.. అప్పుడప్పుడు పార్సిళ్లు చేరాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే చోటికి వెళ్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి బార్‌కోడింగ్ విధానం అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల బుక్ చేసినచోట ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే చాలు. చేరినచోట నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే వివరాలు తెలిసిపోతాయి. మరోవైపు, పాత విధానంలో సెల్‌ఫోన్లు, టీవీలు, బల్బులు లాంటివి ఏవి పంపినా.. ఎలక్ట్రానిక్ వస్తువు అనే నమోదు చేసేవారు. తాజా విధానంలో ఏ వస్తువో స్పష్టంగా తెలిసిపోతుంది. తద్వారా మరింత జాగ్రత్తగా తీసుకెళ్లే వీలుంది.
👉 – Please join our whatsapp channel here –