DailyDose

బిస్కెట్లు దొంగలించారని కఠినంగా ప్రవర్తించిన యజమాని- నేర వార్తలు

బిస్కెట్లు దొంగలించారని కఠినంగా ప్రవర్తించిన యజమాని- నేర వార్తలు

* కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సిద్ధిపేట సీపీ శ్వేత కీలక విషయాలు వెల్లడించారు. ఎంపీపై దాడి చేసేందుకు రాజు రెక్కీ నిర్వహించాడన్నారు. ఈ కేసులో రాజు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. నిందితుడికి రాజకీయ పార్టీలతో సంబంధాలు బయటపడలేదన్నారు. వివిధ వెబ్ ఛానెల్స్ లో పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎంపీతో విభేదాలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నిందితుడు రాజుపై గతంలో ఎలాంటి కేసులు లేవన్నారు. కేసులో పురోగతి కోసం కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు.

* బిస్కెట్లు దొంగలించారని కఠినంగా ప్రవర్తించిన యజమాని

తన దుకాణంలో దొంగతనం చేసి పారిపోతున్న నలుగురు బాలురులను యజమాని స్తంభానికి కట్టేసి కొట్టాడు. ఈ ఘటన బిహార్‌ (Bihar)లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీర్‌పుర్‌ జిల్లా ఫజిల్‌పుర్ గ్రామంలో ఓ దుకాణదారుడు మైనర్ల పట్ల కఠినంగా వ్యవహరించాడు. చిన్నారులు స్థానిక దుకాణంలోకి వెళ్లి అక్కడున్న బిస్కెట్లు, మరికొన్ని తినుబండారాలను దొంగలించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న యజమాని వారిని స్తంభానికి కట్టేసి కొట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. అనంతరం దుకాణ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* యూట్యూబ్‌లో చూసి బాంబుల తయారీ

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబ్‌ పేళుళ్ల వ్యవహారంలో కీలక ట్విస్ట్ బయటపడింది. కేరళలో వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్‌ మార్టిన్‌ సోమవారం (అక్టోబర్ 30) అరెస్టయిన విషయం తెలిసిందే. కొచ్చికి చెందిన డొమినిక్‌ మార్టిన్‌ తాను ఏవిధంగా బాంబులు తయారు చేశాడో పోలీసులకు వివరించాడు. మార్టిన్‌కు స్వతహాగా బాంబులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. అతను ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో ఇందుకు సంబంధించిన విషయపరిజ్ఞనాం సముపార్జించినట్లు తెలిపాడు. దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలు వాడినట్లు చెప్పుకొచ్చాడు.త్రిపుణితుర నుంచి పెట్రోల్ కొనుగోలు చేసిన డొమినిక్‌ మార్టిన్‌ ఇంటరాగేషన్‌లో మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాడు. యూట్యూబ్‌ని చూసి బాంబులు తయారు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఇలా తయారు చేసిన బాంబులను ఆదివారం ఉదయం 7 గంటలకు కన్వెన్షన్ సెంటర్‌లోని కుర్చీల కింద పెట్టాడు. ఆ సమయంలో హాలులో ముగ్గురే ఉన్నారని, పేలుడు కోసం నిందితులు దాదాపు 50 బాంబులను వినియోగించినట్లు తెలిపాడు. ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపి కన్వెన్షన్ సెంటర్‌లో మొత్తం ఆరు చోట్ల ఉంచినట్లు పేర్కొన్నాడు. వీటికి బాంబును అమర్చి రిమోట్‌ కంట్రోల్‌తో వాటిని పేల్చానన్నాడు. వాటిల్లో మూడు బాంబులు పేలాయి. ఘటనకు సంబంధించిన లైవ్ విజువల్స్‌ కూడా తాను రికార్డు చేసినట్లు నిందితుడు తెలిపాడు. తాను తయారు చేసిన బాంబులు మార్టిన్ ఎప్పుడూ ప్రయోగించలేదని, సక్రమంగా పనిచేస్తుందన్న నమ్మకంతోనే ఈ బాంబులు పెట్టినట్లు పోలీసుల ఎందుట నేరం అంగీకరించాడు. అంతా తానొక్కడినే చేసినట్లు చెప్పాడు.కాగా కలమస్సేరిలో జెహోవా సాక్షులు ఆదివారం (అక్టోబర్‌ 29) ప్రార్థనలు నిర్వహిస్తుండగా మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను పుష్పన్ భార్య కుమారి (53), లియోనా పౌలోస్ (60), లిబినా (12)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో 52 మంది గాయపడ్డారు. వీరిలో 18 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేల్చేందుకు ఉపయోగించిన రిమోట్‌ను నిందితుడు మార్టిన్ పోలీసులకు అప్పగించాడు. పేలుడుకు సంబంధించిన వీడియోను కూడా అందజేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

* కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌పై కేసు

కేరళ వరుస పేలుళ్ల నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం (అక్టోబర్ 31న) కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఈ ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.సెక్షన్ 153 (ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశారు. పాలస్తీనాకు సీపీఎంతో మద్దతుతో కలమసేరి పేలుళ్లను ముడిపెట్టి, ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మర్నాడు ఈ పరిణామం చోటు చేసుకుంది.అటు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది. విచ్ఛిన్నకర, అతివాద శక్తులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ కేరళ చీఫ్ కె సురేంద్రన్ ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వారిని కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బీజేపీ నేత ఆరోపించారు.

* పదో తరగతి విద్యార్థి హత్య

ఓ టీచర్‌ దగ్గర ట్యూషన్‌ చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య (Murder) చేశాడు. పక్కా ప్రణాళిక ప్రకారం స్టోర్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. అంతేకాకుండా మీ కుమారుడ్ని కిడ్నాప్‌ చేశానని, విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని మృతుడి తల్లిదండ్రులను హెచ్చరించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. విద్యార్థిని నిందితుడు బలవంతంగా తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు తేలింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UttarPradesh) కాన్పూర్‌లో జరిగిందిపోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రచిత అనే 21 ఏళ్ల యువతి కాన్పూర్‌లో ట్యూషన్‌ నడుపుతోంది. పదో తరగతి చదువుతున్న ఓ 17 ఏళ్ల విద్యార్థి చదువుకోవడానికి ఆమె దగ్గరకి వెళ్తుంటాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా.. బాలుడ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రణాళిక ప్రకారం.. బాలుడి ఇంటికి వెళ్లి.. రచిత పిలుస్తోందని నమ్మించి తనతోపాటు బైక్‌పై తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లినట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో నమోదైంది. అక్కడికి 20 నిమిషాల తర్వాత కేవలం శుక్లా మాత్రమే బయటకు వచ్చినట్లు అందులో ఉంది. ఆ తర్వాత అతడు దుస్తులు మార్చుకొని విద్యార్థి తీసుకొచ్చిన బైక్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి సహా, ట్యూషన్‌ టీచర్‌ రచిత, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరోవైపు కిడ్నాప్‌ చేసినట్లు విద్యార్థి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పకముందే.. బాలుడ్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కానీ, ఎందుకు చంపాడన్న దానిపై స్పష్టమైన కారణాలు తెలియలేదు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

* వివాహిత అనుమానస్పద మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో దారుణం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వివాహిత వేముల నవిత(31) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నవితను గత కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం భర్త, అత్త మామ, ఆడపడుచుల వేధింపులకు గురవుతున్నారు. గత 9 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వరుణ్ గౌడ్‌తో నవితకు వివాహం చేశారు కుటుంబ సభ్యులు.వివాహమైన కొన్ని సంవత్సరాలకు అదనపు కట్నం తేవాలని భర్త వరుణ్ గౌడ్, కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. నవిత జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని వేధిస్తూ భర్త వరుణ్ గౌడ్‌తో పాటు అత్త మామ, ఆడపడుచులు ఉరివేసి హత్య చేశారని నవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసిన భర్త వరుణ్ గౌడ్‌తో పాటు అత్త మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేయాలని నవిత కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

* ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి జిల్లెలగూడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి(16).. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైట్‌ నోట్‌ రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని ప్రిన్సిపల్‌ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించాడు. ఇంకెవరూ ఈ కాలేజీలో జాయిన్ కావొద్దని.. సారీ అమ్మా, నాన్న అని లేఖలో పేర్కొన్నాడు. తమకు న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించేదిలేదని కుటుంబసభ్యులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* చెట్టును ఢీ కొట్టిన కారు

కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హర్డోయ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. వీరంతా బరాకాంత్​ నుంచి నయాగావ్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.హర్డోయ్ జిల్లాలోని ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవేపై ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్​ కట్టర్లు వినియోగించాం. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఉన్నారు. బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాము. ప్రమాదానికి గల పూర్తి కారణాలను ఆరా తీస్తున్నాం. అని హర్డోయ్ జిల్లా పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z