Business

అంబానీకి మూడో బెదిరింపు మెయిల్‌

అంబానీకి మూడో బెదిరింపు మెయిల్‌

భారత దిగ్గజ వ్యాపార వేత్త, ఆసియాలోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపు మెయిల్‌ (death threat mail ) వచ్చింది. ఈ సారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని దుండగులు డిమాండ్‌ చేశారు. లేదంటే చంపేస్తామంటూ బెదిరించారు. సోమవారం ఉదయం ఈ మెయిల్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల్లో ఇది మూడో బెదిరింపు మెయిల్‌ కావడం గమనార్హం.

అక్టోబర్ 27, 28 తేదీల్లో కూడా అంబానీకి బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు తెలిసిందే. ముందుగా 27వ తేదీన రూ.20 కోట్లు డిమాండ్‌ చేసిన దుండగులు.. ఆ తర్వాతి రోజు దాని రేటును రూ.200 కోట్లకు పెంచేశారు. ఇప్పుడు దాన్ని డబుల్‌ చేసి రూ.400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ మూడు బెదిరింపులు ఒకే ఈ మెయిల్‌ ఐడీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మెయిల్‌ పంపిన వ్యక్తిని షాదాబ్‌ ఖాన్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. బెల్జియం (Belgium) నుంచి ఈ మెయిల్స్ పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా, గతంలోనూ అంబానీ కుటుంబానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. 2020లో ముంబయిలోని అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ కారు నిలిపిఉంచడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మరో ఘటన.. రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రికి గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌ చేసిన గుర్తు తెలియని ఆగంతకుడు అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్‌ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో కూడా అంబానీకి చెందిన ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు వరుసగా ముకేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z