ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న రామ మందిరం (Ram Mandir) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శిల్పకారులు ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Teerth Kshetra) తెలిపింది. ఈ నేపథ్యంలో రామ మందిరానికి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతున్నారని.. డిసెంబరు 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుందన్నారు.
రామ మందిరంలో మొదటి అంతస్తును డిసెంబరు 15 నాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మొదటి అంతస్తులో 17 పిల్లర్లు ఏర్పాటు చేశామని, మరో రెండింటిని త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పరికర్మ మార్గ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం గృహ మండపం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల చివరికల్లా రామ మందిరం బయట ఉన్న ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం భక్తులు పెద్ద ఎత్తున బంగారు, వెండి వస్తువులను విరాళాలుగా సమర్పించారని, వాటిని భద్రపరచడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువులను ప్రస్తుతం ఒక ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో కరిగించి భద్రపరుస్తున్నట్లు తెలిపారు.
గత వారం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోదీని కలిసి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –