* ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.కాగా, కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, విప్రో వంటి టాప్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది.మిడ్ లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్‌లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగులు నెలలో 10 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. ‘రిటర్న్ టు ఆఫీస్ విధానం, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను బలోపేతం చేసే దిశగా.. ఉద్యోగుల్ని నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. 2023, నవంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఇన్ఫీ వైస్‌ప్రెసిడెంట్స్ నుంచి ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందింది.
* దేశంలో భారీగా జీఎస్టీ వసూళ్లు
దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు (GST collections) భారీగా నమోదయ్యాయి. అక్టోబర్ నెలకు గాను రూ.1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 1.87 లక్షల కోట్లు అత్యధికం కాగా.. తాజా వసూళ్లు రెండో అత్యధికంగా నిలిచాయి. గతేడాదితో రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 13 శాతం మేర పెరిగాయి.అక్టోబర్ నెల మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ రూపంలో 30,062 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.38,171 కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐజీఎస్టీ రూపంలో రూ.91,315 కోట్లు రాగా.. రూ.12,456 కోట్లు సెస్సుల రూపంలో వచ్చినట్లు వెల్లడించింది. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ అనంతరం అక్టోబర్ నెలకు కేంద్రానికి రూ.72,934 కోట్లు, రాష్ట్రాలకు రూ.74,785 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. జీఎస్టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది ఇదే సమంలో తెలంగాణ సీజీఎస్టీ వసూళ్లు రూ.9538 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.11,377 కోట్లకు పెరిగాయి. అంటే 19 శాతం వృద్ధి నమోదైంది. సెటిల్‌మెంట్ అనంతరం రూ.23,478 కోట్లు ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వసూళ్లు రూ.7,347 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.8127 కోట్లకు పెరిగాయి. సెటిల్‌మెంట్ అనంతరం రూ.18,488 కోట్లు ఆదాయం సమకూరింది. సెటిల్‌మెంట్ అనంతరం మహారాష్ట్రకు అత్యధికంగా రూ.84,712 కోట్ల ఆదాయం వచ్చింది.
* నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్లు నష్టపోయి 63,591కి చేరుకుంది. నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 18,989కి దిగజారింది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
* ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్స్‌కు భారీ డిస్కౌంట్
డ్రీం ఫోన్ ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకున్నా ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ దివాళీ సేల్ బంపర్ ఛాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. నవంబర్ 2 నుంచి షురూ కానున్న బిగ్ దివాళీ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్స్‌ను భారీ డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 14 లాంఛ్ ప్రైస్ రూ. 79,900 కాగా సేల్‌లో కేవలం రూ. 49,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది.బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో కలుపుకుని ఐఫోన్ 14 రూ. 50,000లోపు లభిస్తుండటంతో ఈ హాట్ డివైజ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14 బేస్ మోడల్ లిస్టింగ్ ధరను ఈకామర్స్ దిగ్గజం రూ. 54,999గా నిర్ణయించగా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు కలిగిన కస్టమర్లకు రూ. 4000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.పాత డివైజ్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వారికి రూ. 1000 బోనస్ అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్లన్నీ కలుపుకుంటే ఐఫోన్ 14 కేవలం రూ. 49,999కే లభిస్తుంది. ఒకేసారి ఇంత మొత్తం చెల్లించలేని వారికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
* విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతి
భారత కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో ప్రత్యక్షంగా లిస్ట్ (Overseas Listing) కావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కొన్ని షరతులకు లోబడి అనుమతులు ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కంపెనీల (సవరణ) చట్టం 2020లో మార్పులు చేసినట్లు తెలిపింది. 2023 అక్టోబర్ 30 నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ కంపెనీలు ‘అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ADRs)’, ‘గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (GDRs)’ ద్వారా విదేశీ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి.అయితే, విదేశీ ఎక్స్చేంజీల్లో దేశీయ కంపెనీల లిస్టింగ్ (Overseas Listing)కు సంబంధించిన నియమ నిబంధనలను ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. లిస్టింగ్‌కు సంబంధించిన నిబంధనల రూపకల్పనతో పాటు అర్హత ప్రమాణాలు ఇతరత్రా అంశాలపై మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోందని అక్టోబర్ 18న ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. అలాగే ప్రపంచ మార్కెట్ల నుంచి మూలధనాన్ని సమకూర్చుకునేలా దేశీయ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు జులై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వాస్తవానికి కేంద్రం ఈ అంశాన్ని 2020లో కొవిడ్ ఉపశమన చర్యల్లో భాగంగా ప్రకటించింది.అహ్మదాబాద్ గిఫ్ట్ సిటీలోని ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్’లో లిస్ట్ అయ్యేందుకు దేశీయ కంపెనీలను తొలుత అనుమతించాలనేది ప్రణాళిక అని జులై 28న ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. తర్వాత నిర్దేశిత 8 నుంచి 9 విదేశీ పరిధుల్లో లిస్ట్ అయ్యేందుకు ఆమోదం తెలిపాలని యోచించినట్లు పేర్కొన్నారు. విదేశీ లిస్టింగ్ (Overseas Listing)కు సంబంధించి పటిష్ఠమైన అక్రమ నగదు చలామణి నియంత్రణలతో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను సెబీ గతంలోనే ప్రతిపాదించింది. ఎన్‌వైఎస్‌ఈ, నాస్డాక్, ఎల్‌ఎస్‌ఈ, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, కెనడాలో లిస్టింగ్‌ను సెబీ సిఫార్సు చేసింది.
* బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్
బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వినియోగ దారులకు గుడ్ న్యూస్. రాబోయే 6-8 నెలల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన 5జి వ్యవస్థను వినియోగించే అవకాశం ఉందని ప్రభుత్వరంగ సంస్థ సీ-డాట్ సీఈఓ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. 5జి స్టాండలోన్ రేడియో, కోర్ అండ్ ఐపి మల్టీమీడియా సిస్టంను దేశంగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు.తాము అభివృద్ధి చేసిన 5జీ గేర్లతో కూడిన నెట్వర్క్ ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని వీడియోకాల్ వినియోగించినట్లు వెల్లడించారు. పంజాబ్ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ లో 4జి, 5జి నాన్ స్టాండలోన్ కోర్ వ్యవస్థలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్రమంగా దీన్ని దేశం అంతటా విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా 4జీ సేవలను ఈ ఏడాది డిసెంబర్లో, 5జీ సేవలను 2024 జూన్ తర్వాత ప్రవేశపెడతామని బిఎస్ఎన్ఎల్ సిఎండి పీకే పూర్వార్ వివరించారు.
* భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101 పెంచాయి. అంతకుముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిండర్ ధరన రూ.250 మేర పెరిగింది. అక్టోబర్‌లో మరో రూ.200 పెంచారు. ఇప్పుడు ఇంకో రూ.100 పెంచడంతో ఇటీవల తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైనట్లయ్యింది.కాగా, తాజా పెంపుతో కలిపి దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,833కు చేరింది. అంతకుముందు ఇది రూ.1,732గా ఉండేది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.1,999.50 కి, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో రూ.1,943 కి, మహారాష్ట్ర రాజధాని ముంబైలో రూ.1,785.50కి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెంచిన కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం మారలేదు. ఆగస్టు 30న వీటి ధరను రూ.200 తగ్గించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలేగాక విమాన ఇంధన ధరల (ATF Price) ను కూడా చమురు విక్రయ సంస్థలు పెంచాయి. ఒక్కో కిలో లీటరుపై అదనంగా మరో రూ.1,074 భారం వేశాయి. దాంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,11,344.92కు చేరింది. ఇలా జెట్ ఇంధనం ధర పెరగడం గత ఐదు నెలల్లో ఐదోసారి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 19 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. కాగా, ప్రతి నెల 1వ తేదీన వంటగ్యాస్‌తోపాటు ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు ప్రతినెల సవరిస్తుంటాయి.
👉 – Please join our whatsapp channel here –