అమెరికాలో (America) పంది గుండె (Pig heart) అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. లారెన్స్ ఫౌసెట్(58)కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతిచెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ వెల్లడించింది. తొలుత నెల రోజులపాటు అది మెరుగ్గానే పనిచేసిందని.. ఆ తరువాత నుంచి క్షీణించడం మొదలైందని పేర్కొంది.‘లారెన్స్ ఫౌసెట్ శస్త్రచికిత్స పూర్తయిన తరువాత అతడి ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు కనిపించింది. ఫిజియో థెరపీలో పాల్గొన్నాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ.. భార్యతో కలిసి కార్డ్స్ కూడా ఆడేవాడు. ఇటీవలి రోజుల్లో అతడి గుండె వైఫల్య సంకేతాలను చూపించింది. ఆయనకు చేసింది మానవ అవయవాల మార్పిడిలో ఓ సవాలుతో కూడుకున్న శస్త్ర చికిత్స. అందుకోసం వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ లారెన్స్ అక్టోబరు 30న తుది శ్వాస విడిచాడని’ ఆయనకు చికిత్స అందజేసిన ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
లారెన్స్ ఫౌసెట్ గతంలో నేవీలో పనిచేశాడు. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’లో ల్యాబ్ టెక్నీషియన్‌గా రిటైర్డ్ అయ్యాడు. గుండె మార్పిడి కోసం అతను మేరీల్యాండ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు తొలుత శస్త్రచికిత్సకు నిరాకరించారు. చివరికి పంది గుండె అమర్చడంతో ఇన్నాళ్లు బతికాడని లారెన్స్ భార్య యాన్ తెలిపారు.జంతువుల అవయవాలను మానవులకు అమర్చే ప్రక్రియను వైద్య పరిభాషలో ‘జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారు. అవయవ దాతలు తక్కువగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ మార్గాన్ని ఎంచుకొని ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు మానవుల్లోని రోగ నిరోధకశక్తి కారకాలు కొత్తగా అమర్చిన జంతువుల అవయవంపై దాడి చేస్తుంటాయి. అందుకే శాస్త్రవేత్తలు జన్యుపరమైన మార్పులు చేసి వాటిని మానవులకు అమర్చుతున్నారు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించడంలేదు. గతేడాది ప్రపంచ వైద్య చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా డేవిడ్ బెన్నెట్(57) అనే వ్యక్తికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పంది గుండెను అమర్చారు. అతడు సుమారు రెండు నెలలు మాత్రమే జీవించాడు.
👉 – Please join our whatsapp channel here –