Movies

ఒక్కటైన వరుణ్ లావణ్య

ఒక్కటైన వరుణ్ లావణ్య

దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej) – నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం వరుణ్‌ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ‘‘దాదాపు ఐదారేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. నాకేదిష్టమో తనకు బాగా తెలుసు. మా అభిరుచులూ కలవడంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. నేనే ముందు ప్రపోజ్‌ చేశా. ఇరు కుటుంబాలూ మా ప్రేమను అంగీకరించాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమకథను పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌. తాను వాడుతున్న ఫోన్‌ని సైతం లావణ్యనే గిఫ్ట్‌గా ఇచ్చిందని చెప్పారాయన.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z