Business

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయమే బలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. అమెరికాలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు రేట్ల పెంపు ఇక ముగిసినట్లేననే సంకేతాలు ఫెడ్‌ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ర్యాలీ అయ్యాయి. మరోవైపు గత రెండు రోజుల వరుస నష్టాల నేపథ్యంలో కీలక కంపెనీల స్టాక్స్‌ను మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 64,033.40 దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 64,202.64 దగ్గర గరిష్ఠాన్ని, 63,815.35 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 489.57 పాయింట్ల లాభంతో 64,080.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,120.00 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,175.25- 19,064.15 మధ్య కదలాడింది. చివరకు 144.10 పాయింట్లు లాభపడి 19,133.25 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు బలపడి 83.26 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

* సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దీపక్‌ ఫర్టిలైజర్స్‌ ఏకీకృత నికర లాభం 77 శాతం కుంగి రూ.63.45 కోట్లకు తగ్గింది. ఆదాయం 11 శాతం తగ్గి రూ.2,424 కోట్లకు చేరింది. కంపెనీ షేరు ఈరోజు 6.64 శాతం నష్టపోయి రూ.595 వద్ద స్థిరపడింది.

* జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో అదానీ పవర్‌ ఏకీకృత నికర లాభం తొమ్మిందితలు పెరిగి రూ.6,594 కోట్లకు చేరింది. ఆదాయం 61 శాతం పెరిగి రూ.12,155 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు ఈరోజు 2.14 శాతం పెరిగి రూ.372.80 దగ్గర ముగిసింది.

* గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ జులై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.66.80 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన ఇది 22 శాతం అధికం. ఆదాయం రూ.369 కోట్ల నుంచి రూ.605 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు ఈరోజు 2.99 శాతం లాభపడి రూ.1,715 వద్ద నిలిచింది.

* మహారాష్ట్రలో అందుబాటులోకి రానున్న తమ ప్లాంట్‌కు అవసరమైన ఫీడ్‌స్టాక్‌ కోసం బీపీసీఎల్‌తో రూ.63 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు గెయిల్‌ వెల్లడించింది. గెయిల్‌ షేరు ఈరోజు 3.82 శాతం పెరిగి రూ.122 దగ్గర ముగిసింది. మరోవైపు బీపీసీఎల్‌ షేరు ధర 0.92 శాతం పెరిగి రూ.360.20 దగ్గర స్థిరపడింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z