పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల హక్కుల కోసమే భారత్ రాష్ట్ర సమితి (భారాస) పుట్టిందన్నారు. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. పదేళ్లు తెలంగాణను ఆశీర్వదించారని ప్రజలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
‘‘తెలంగాణ గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలనేదానిపై ఎంతో ఆలోచన చేశాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంతోనే రైతుబంధు తీసుకొచ్చాం. అది ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదు. తెలంగాణలో నీళ్లు ఉచితమే. కరెంటు ఉచితమే. రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే రైతుల రుణమాఫీ చేశాం. మరికొంత మందికి మాఫీ చేయాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మరికొంత మందికి పూర్తి చేయలేక పోయాం. ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. గతంలో రైతులకు సాయం చేయాలని ఎవరూ ఆలోచించలేదు. కాంగ్రెస్ నేతలు ఇవాళ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతుబంధు దుబారా ఖర్చు అని అంటున్నారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ భారాస గెలవాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –