Kids

వడగండ్ల కథ

వడగండ్ల కథ

కొడుక్కి యోగా నేర్పిద్దామని ఓ తండ్రి శిక్షకుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ‘వదులైన దుస్తులు వేసుకోవాలి, సూర్యో
దయానికి పూర్వమే రావాల’ని చెప్పాడు శిక్షకుడు. మరుసటిరోజు నుంచీ తండ్రి తన కారులో కొడుకును తీసుకెళ్లడం ప్రారంభించాడు. కొడుకు యోగా చేస్తున్నంత సేపూ గది పక్కనే ఉన్న చెట్ల కింద కూర్చునేవాడు తండ్రి. మూడోరోజు ఉదయం వడగండ్ల వర్షం మొదలైంది. కొడుకు అసహనంగా తరగతి నుంచి బయటికి వచ్చాడు. అతని వాలకం చూసి ఏమైందని అడిగాడు తండ్రి. ‘నేను ఎంత బాగా ఆసనాలు వేసినా శిక్షకుడు ఏదో ఒక తప్పు పడుతున్నాడు, సరిగా చేయలేదని కోప్పడుతున్నాడు’ అన్నాడు. అబ్బాయిని సముదాయిస్తూ ‘నువ్వు ఆసనాలు బాగా వేయాలని, ఆయన కఠినంగా మాట్లాడి ఉండవచ్చు.

ఆయన మాటలను కాకుండా, అందులోని భావం అర్థం చేసుకో. ఆయన చెప్పినట్టు వింటే నీకే కదా ప్రయోజనం’ అన్నాడు తండ్రి. కొడుకు కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ‘అక్కడ పడుతున్న వడగండ్లను గమనించు’ అన్నాడు తండ్రి. ‘ఏముంది వడగండ్లు కాసేపటికి నీరుగా మారుతున్నాయి’ అన్నాడు. తండ్రి చిన్నగా నవ్వి ‘వడగండ్లు చూడటానికి కఠినంగా కనిపించినా కాసేపటికే నీరుగా మారిపోతున్నాయి కదా! మన మంచికోరే వారి కోపం వడగండ్ల లాంటిదే. వారు కఠినంగా మాట్లాడినప్పుడు మనకు బాధ కలిగినా, వాటివల్ల మనకు మంచే జరుగుతుంది’ అని హితవు చెప్పాడు. మర్నాడు కొడుకు ఉత్సాహంగా యోగా శిక్షణకు హాజరయ్యాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z