అన్నవరం దేవస్థానం రూ.800 వ్రత టికెట్టును రూ.వెయ్యికి పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఈ మండలి సమావేశానికి ఛైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షత వహించారు. అభివృద్ధి పనులపై ఈవో ఆజాద్, సభ్యులు చర్చించారు. 2023-24 సప్లిమెంటరీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. పలు అభివృద్ధి పనుల టెండర్లు, అంచనాలకు ఆమోదం తెలిపారు. దాత సహకారంతో అనివేటి మండపంలో బంగారు తాపడంతో ధ్వజస్తంభం ఏర్పాటుకు తీర్మానించారు.
కార్తిక మాస ఏర్పాట్లపై…కార్తిక మాసంలో సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో ఆజాద్ తెలిపారు. భక్తుల రద్దీ, ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో, సహాయ కమిషనర్ రమేశ్‌బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, శంఖవరం, తొండంగి మండలాల తహసీల్దార్లు కె.సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాడు సీఐ ఎం.శేఖర్‌బాబు, నీటిపారుదల, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య, ఆర్టీసీ తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పర్వదినాల్లో ఏరోజు ఎందరు భక్తులు వస్తారో అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆజాద్ తెలిపారు. డిసెంబరు 4న సత్యదీక్ష విరమణ రోజున మాలధారణ చేసిన భక్తులంతా గిరిప్రదక్షిణ చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. తెప్పోత్సవం రోజున, గిరిప్రదక్షిణ సమయంలో భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, తెప్పోత్సవంలో హంసవాహనం పంపా సరోవరంలో విహరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు.
👉 – Please join our whatsapp channel here –