* ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్
టెక్ దిగ్గజం మెటా ఆధ్వర్యంలోని సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇన్‌స్టా స్టోరీస్‌కు మాత్రమే పరిమితమైన పాటల లిరిక్స్‌ను జత చేసే ఫీచర్‌ను ఇప్పుడు రీల్స్ (Insta Reels)కూ విస్తరించింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టా ఛానెల్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు యూజర్లు రీల్స్‌లోని సాంగ్స్‌కు లిరిక్స్ యాడ్ చేయాలంటే మాన్యువల్‌గా టైప్ చేయాల్సి వస్తోంది. కానీ, ఇకపై ఆ అవసరం ఉండదని ఆయన తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.రీల్ క్రియేట్ చేసి మ్యూజిక్ బటన్‌పై ట్యాప్ చేయాలి.రీల్‌కు జత చేయాల్సిన పాటను ఎంచుకోవాలి.ఎడమ వైపు స్వైప్ చేసి లిరిక్స్‌ను యాడ్ చేయొచ్చు.రీల్స్ (Insta Reels)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టా మరిన్ని కొత్త, వినూత్నమైన ఫీచర్లను తీసుకొచ్చే యోచనలో ఉంది. ‘ఏఐ ఫ్రెండ్’ అనే ఆప్షన్‌తో కృత్రిమ మేధ ఆధారిత ఊహాజనిత మిత్రుడిని సృష్టించుకునేలా ఓ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు, క్లిష్టమైన పరిస్థితుల్లో పరిష్కారాల కోసం ఏఐ ఫ్రెండ్ సహాయంగా ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత ఫీచర్లు చాలా రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
* ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 4జీ ప్లాన్‌ల ధరలను ఎప్పుడైనా పెంచవచ్చని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం 5G కోసం కంపెనీ ఎలాంటి అదనపు ఛార్జీని వసూలు చేయదని తెలిపారు. ఎయిర్‌టెల్ మాదిరిగానే జియో కూడా 5జీ ప్లాన్‌ల ధరలను పెంచబోమని ఇటీవలే ప్రకటించింది. దీనర్థం కస్టమర్‌లు ప్రస్తుత రేటుతో హై స్పీడ్ 5G ఇంటర్నెట్‌ని పొందడం కొనసాగిస్తారు.ET టెలికాం నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ, కంపెనీ గతంలో కూడా పోటీని పట్టించుకోకుండా ఎంట్రీ లెవల్ ప్లాన్‌ల ధరలను స్వల్పంగా పెంచింది. ఇప్పుడు త్వరలో ఇది ఇతర ప్రణాళికలకు కూడా అమలు చేయబడుతుంది. ప్రస్తుతానికి, కంపెనీ ప్లాన్‌ల ధరలను ఎంతవరకు పెంచుతుందనే సమాచారం అందుబాటులో లేదు. అయితే దేశంలో 4G ప్లాన్‌ల ధరలను ముందుగా ఎయిర్‌టెల్ పెంచడం ఖాయం.రిలయన్స్ జియో తన 5జీ నెట్‌వర్క్‌ను స్టాండ్ ఎలోన్ టెక్నాలజీతో ప్రారంభించింది. అంటే దీని కోసం కంపెనీ 4జీ నెట్‌వర్క్ సహాయం తీసుకోలేదు. ఎయిర్‌టెల్ నాన్-స్టాండ్ అలోన్ టెక్నాలజీపై 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. దీని కోసం కంపెనీ 4G LTE EPC (ఎవాల్వ్డ్ ప్యాకెట్ కోర్)ని 5G టవర్‌లోని కొత్త రేడియో (NR)కి కనెక్ట్ చేసింది. అంటే 4జీ టవర్ సాయం తీసుకున్నారన్నమాట. ET నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ, కంపెనీ అవసరాలు, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర నిర్మాణానికి మారుతుందని తెలిపారు. మార్కెట్, కస్టమర్ అవసరాల కంటే ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందే ఉంటుందని, అయితే ఇతర ఆపరేటర్లు చేస్తున్న విధంగా అతిపెద్ద రోల్‌అవుట్‌ను క్లెయిమ్ చేయడానికి అనవసరమైన మూలధనాన్ని ఖర్చు చేయదని కూడా ఆయన చెప్పారు.
* ఏఐతో కొలువుల కోత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు. ఏఐతో కొలువుల కోత తప్పదని, చరిత్రలో ఇది అత్యంత వినాశనకారిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఏఐ గురించి మస్క్ ఇటీవల బ్రిటన్ ప్రదాని రిషీ సునాక్‌తో ముచ్చటించిన క్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీ మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఐ భద్రతా సదస్సు సందర్భంగా వీరిరువురు భేటీ అయిన సంగతి తెలిసిందే. చరిత్రలోనే విధ్వంసక శక్తిగా ఏఐ రాబోయే రోజుల్లో మనుషులు చేసే అన్ని ఉద్యోగాలను కనుమరుగు చేస్తుందని ఈ సందర్భంగా మస్క్ హెచ్చరించారు. విధ్వంసం దిశగా పయనించే ఏఐ కట్టడికి నియంత్రణ అవసరమని ఏఐకి ఓ రిఫరీ ఉండటం మంచిదేనని మస్క్ పునరుద్ఘాటించారు.ఏఐతో మనం అసలు ఉద్యోగాలు అవసరం లేని దశకు చేరుకుంటామని చెప్పారు. ఏఐ అన్ని పనులు చేసి పెడుతుందని మీరు వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగం కోరుకుంటే చేయవచ్చని ఈ పరిస్ధితిలో మంచి, చెడు రెండూ ఉన్నాయని మస్క్ చెప్పుకొచ్చారు.
* బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా
2023 దీపావళి పండగ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీపావళి నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యతనిస్తూ.. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.దీపావళి పండగ కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్‌లో మొదటిది రూ. 251. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డేటా కోసం మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్‌ఎనల్ మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా 3 జీబీ డేటా లభిస్తుంది.దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 666. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 105 రోజుల పాటు అన్‌లిమిటిడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఎలాంటి డేటా లభించదు. ఐతే బీఎస్‌ఎనల్ సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే 3 జీబీ డేటా వస్తుంది.బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ నైట్ డేటాను కూడా కూడా పొందొచ్చు.
* అదానీ గూటికి క్వింట్ మీడియా
ప్రధాని నరేంద్ర మోది సన్నిహితుడిగా పేరొందిన గౌతమ్ అదానీ మీడియా రంగంలోకి శరవేగంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని టేకోవర్ చేసిన అదానీ గ్రూప్ తాజాగా డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్ (గతంలో బ్లూంబర్గ్‌క్వింట్)ను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్నారు. బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లిన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో (క్యూబీఎంఎల్) మిగిలిన 51 శాతం వాటాను సొంతం చేసుకున్నారు.ఇదే గ్రూప్ 2022 మార్చిలో 49 శాతం క్వింట్ వాటాను కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ కొనుగోలు తర్వాతే ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. క్యూబీఎంఎల్‌లో 51 శాతం వాటా కోసం తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది.లావాదేవీ విలువను వెల్లడించలేదు. గతంలో రూ.47.84 కోట్లకు 49 శాతం వాటాను కొన్నది. ప్రస్తుతం సంస్థ ను పూర్తి అధీనంలోకి తెచ్చుకునేందుకు మెజారిటీ వాటా కొ న్నందున, ఈ లావాదేవీ విలువ అధికంగా ఉం టుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్ట్, వాణిజ్యవేత్త రాఘవ్ బెహల్ ప్రమోట్ చేసిన క్వింటిల్లిన్ మీడియా యూఎస్‌కు చెందిన ఫైనాన్షియల్ న్యూస్ ఏజెన్సీ బ్లూంబర్గ్‌తో కలసి జాయింట్ వెంచర్‌గా బ్లూంబర్గ్ క్వింట్‌ను నడిపారు. గత ఏడాది మార్చిలో ఈ వెంచర్ నుంచి బ్లూంబర్గ్ వైదొలిగింది. బిజినెస్ న్యూస్ చానల్ సీఎన్‌బీసీ టీవీ 18 రాఘవ్ బెహల్ నేతృత్వంలోని నెట్‌వర్క్ 18 గ్రూప్ నెలకొల్పిందే. ఈ గ్రూప్‌ను రిలయన్స్‌కు విక్రయించారు. అటుతర్వాత బ్లూంబర్గ్ క్వింట్‌ను ప్రారంభించారు.
* త్వరలో శ్రీలంకలో యూపీఐ సేవలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. ఈ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ త్వరలో ప్రారంభించబడుతుందని చెప్పారు. భారతదేశండిజిటల్ చెల్లింపు ప్రమాణీకరణ యూపీఐ పరిధి విదేశాలలో కూడా నిరంతరం పెరుగుతుండటం గమనార్హం. అనేక దేశాలు ఈ చెల్లింపు విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఇప్పుడు దీనికి త్వరలో శ్రీలంక పేరు కూడా చేరబోతోంది. భారతదేశంతో సహా మొత్తం ప్రపంచంలో UPI ఆధిపత్యం చాలా వేగంగా పెరుగుతోంది. ఈ చెల్లింపు వ్యవస్థ భారతదేశంలో గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత, ఇప్పుడు పొరుగు దేశం శ్రీలంక కూడా దీనిని అనుసరించబోతోంది. భారతీయ తమిళులు శ్రీలంకకు వచ్చి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పాల్గొన్నారు. ఇందులో త్వరలో దేశంలో యూపీఐని ప్రారంభించడం గురించి మంత్రి మాట్లాడారు. దీనితో పాటు భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు చాలా లోతైనవని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న కనెక్టివిటీతో అనేక ఇబ్బందులను అధిగమించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలుగుతామన్నారు.దీనితో పాటు భారతదేశం శ్రీలంక కష్ట సమయాల్లో సహాయం చేసిందని, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి భారతదేశం 4 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పని చేస్తూనే ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. కష్టకాలంలో శ్రీలంకకు ఆర్థిక సాయం అందించిన తొలి దేశం మనదేనన్నారు. దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి త్వరగా సహాయం పొందవచ్చు. భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా పెరిగింది. దీని తరువాత, అనేక ఇతర దేశాలు కూడా ఈ డిజిటల్ చెల్లింపు సాంకేతికతపై తమ ఆసక్తిని చూపించాయి. శ్రీలంకతో పాటు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ టెక్నాలజీని ఆమోదించాయి. ఫిబ్రవరి 2023లో ఈ చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన ఒప్పందంపై సింగపూర్ సంతకం చేసింది. దీని తరువాత, ఇప్పుడు సింగపూర్ నుండి భారతదేశానికి QR కోడ్, మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే డబ్బు లావాదేవీలు చేయవచ్చు.
* లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే వరకు నిఫ్టీ 97 పాయింట్లు లాభాపడి 19230 వద్దకు చేరింది. సెన్సెక్స్ 282 పాయింట్లు పుంజుకుని 64363 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, జేఎస్‌డబ్ల్యూ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ స్టాక్‌లు లాభాల్లో పయనించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటాస్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఎన్‌టీపీసీలు నష్టాల్లో ముగిశాయి.యూఎస్ ఫెడ్ ఛైర్మన్ గతంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందనే సూచనలు చేస్తూ వ్యాఖ్యనించారు. దాంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అనంతరం అమెరికా బాండ్ల రాబడులు 10ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. కానీ బుధవారం రాత్రి జెరొమ్‌పావెల్ ఇకపై వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలపడంతో మార్కెట్ పుంజుకుంది. దాంతో అమెరికాలో ప్రభుత్వ బాండ్ల రాబడులు దిగొచ్చిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లు గురువారం రాణించాయి. ఐరోపా సూచీలు సైతం లాభాల్లోనే స్థిరపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీ రేటును 15 ఏళ్ల గరిష్ఠమైన 5.25 శాతం వద్ద ఉంచింది. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లూ సానుకూలంగా ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.1,261.19 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను అమ్మారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,380.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –