Devotional

శ్రీశైలం ఆర్జిత సేవల్లో మార్పులు

శ్రీశైలం ఆర్జిత సేవల్లో మార్పులు

వ‌చ్చే కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తుల ర‌ద్దీని బ‌ట్టి ఆర్జితసేవలు, దర్శన విధానాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. కార్తీక మాసం అంతా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది యాత్రికులు వేలాది మందిగా త‌ర‌లి వస్తున్నారు.

స్వామివారి గర్బాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, వృద్దమల్లికార్జున స్వామివారి బిల్వార్చన అభిషేకాలు పూర్తిగా నిలిపి వేయ‌నున్నట్లు ఈవో పెద్దిరాజు ప్రకటించారు. అలాగే వారాంతపు సెలవులు, ప్రత్యేక పర్వదినాలైన ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలు నిలిపివేసి భక్తులందరికీ అలంకార దర్శనాలు మాత్రమే కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

సాధారణ రోజుల్లో నాలుగు విడతలుగా ఉండే స్పర్శ దర్శనాల కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. srisailadevasthanam.org , గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి శ్రీశైలం దేవస్థానం అఫిషియల్‌ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని సేవా టిక్కెట్లు, స్పర్శదర్శనం టిక్కెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా శ్రీశైల టీవీ ఛానల్‌ ద్వారా ప్రసారమయ్యే పరోక్షసేవలతోపాటు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు రుద్ర, మృత్యుంజయ, చండీ హోమాలను రెండు విడతలుగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z